Deepak Reddy: పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తికి కరోనా ఎలా వచ్చింది? దీనికి కారణం ఎవరు?: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
- అనంతపురం డీఎస్పీ సహా ఇతర పోలీస్ అధికారులపై హత్యాయత్నం కేసులు పెట్టాలి
- బ్రిటీష్ వారిలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది
- చివరకు మీడియాపై కూడా దాడి చేస్తున్నారు
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండిపడ్డారు. పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తికి కరోనా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అడిగారు. ఈ ఘటనపై అనంతపురం డీఎస్పీ సహా ఇతర పోలీస్ అధికారులపై హత్యాయత్నం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలకు స్వాతంత్ర్యం ఉందా? అని ప్రశ్నించారు. భారతీయులను కులం, మతం, ప్రాంతాల వారీగా బ్రిటీష్ వారు విభజించినట్టు... జగన్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మొత్తం 100 శాతం ఓట్లు వైసీపీకే పడినట్టు ఆ పార్టీ భావిస్తోందని... వారికి 50 ఓట్లు వస్తే, టీడీపీకి 40 ఓట్లు వచ్చాయనే విషయాన్ని మర్చిపోకూడని దీపక్ రెడ్డి అన్నారు. టీడీపీ అనేది అవినీతి, దోపిడీలు, దౌర్జన్యాల నుంచి పుట్టిన పార్టీ కాదని చెప్పారు. దళిత మహిళపై 10 మంది మూడు రోజుల పాటు అత్యాచారం చేస్తే... ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదని అన్నారు. శాసనమండలిలో ఛైర్మన్ పై, ప్రతిపక్ష సభ్యులపై దాడి చేశారని మండిపడ్డారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పిన వ్యక్తికి... అమరావతి రైతుల ఆవేదన కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రశ్నించేవారిపై, చివరకు మీడియాపై కూడా దాడి చేస్తున్నారని మండిపడ్డారు.