China: చైనా రాయబారికి సంప్రదాయ రీతిలో ఆహ్వానం.. యువకుల వీపులపై నడిచిన టాంగ్ సాంగన్.. విమర్శలు!
- కిరిబాటిలో చైనా రాయబారిగా టాంగ్ సాంగన్
- విమానం దిగిన తర్వాత యువకుల వీపులపై నడిచిన టాంగ్
- అది తమ సంప్రదాయమన్న కిరిబాటి
తమ దేశంలో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన చైనా రాయబారి టాంగ్ సాంగన్‌కు కిరిబాటి ద్వీపంలో స్వాగతం పలికిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. టాంగ్ విమానం దిగిన తర్వాత దారిపొడవునా బోర్లా పడుకున్న యువకుల వీపుల పైనుంచి ఆయన నడిచివెళ్లారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఇద్దరు యువతులు ఆయన చేతులు పట్టుకుని ముందుకు నడిపించారు.
ఈ నెలలోనే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో స్పందించిన కిరిబాటి ప్రభుత్వం.. ఇందులో తప్పేం లేదని, అతిథులను ఇలా ఆహ్వానించడం తమ సంప్రదాయంలో భాగమని పేర్కొంది. ఆ దేశ నెటిజన్లు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. తమ దేశానికి తొలిసారి పర్యటనకు వచ్చినప్పుడు, పెళ్లిళ్ల సమయంలోనూ తాము ఇలానే స్వాగతం పలుకుతామని ఓ నెటిజన్ పేర్కొన్నారు.