Dule: ఈ కుర్రాడు పక్కా పల్లెటూరి ర్యాప్ సింగర్!
- ర్యాప్ సంగీతంలో ఆకట్టుకుంటున్న ఒడిశా కుర్రాడు
- సొంతంగా ఆల్బంలు రూపొందిస్తున్న దూలే
- బాలీవుడ్ అంటే ఆసక్తిలేదంటున్న వైనం
అమెరికాలో ర్యాప్ సంగీతం అక్కడి సంస్కృతిలో ఓ భాగం. ముఖ్యంగా అక్కడి నల్ల జాతీయులు ర్యాప్ మ్యూజిక్ ను తమ సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న అమెరికన్ ర్యాపర్లలో నల్లజాతీయులే అధికం. అయితే అడపాదడపా భారత్ లోనూ ర్యాపర్లు కనిపిస్తున్నా, వారిలో కొందరు సినీ పరిశ్రమ వరకే తమ ప్రతిభను పరిమితం చేస్తున్నారు. మిగిలిన వాళ్లు ఒకట్రెండు ఆల్బంలతోనే తెరమరుగైపోతున్నారు. ఈ నేపథ్యంలో దూలే అనే కుర్రాడు భారతీయ ర్యాప్ సమాజంలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు. నిత్యం సమాజంలో కనిపించే అంశాలు, సమస్యలనే తన పాటలో పదాలు ఇమిడ్చి కొత్త బాణీలతో ఆకట్టుకుంటున్నాడు.
దూలే ఓ దళిత సమాజానికి చెందిన యువకుడు. ఒడిశాలో ఓ పేద కుటుంబంలో పుట్టిన దూలే డిగ్రీ పూర్తిచేసినా, సరైన ఉద్యోగ అవకాశాలు లేక, దినసరి భత్యం చెల్లించే చిన్నపాటి పనుల్లో ఉపాధి పొందుతూ, మనుగడ సాగిస్తున్నాడు. అయితే ర్యాప్ మ్యూజిక్ పై ఆసక్తితో సొంతంగా ఆల్బంలు చేసే స్థాయికి ఎదిగాడు. బాలీవుడ్ పై మాత్రం ఆసక్తి లేదంటున్న దూలే... పేదవాళ్ల జీవితాలే తన పాటకు స్ఫూర్తినిస్తాయని చెబుతున్నాడు. వాళ్ల సమస్యలు ప్రస్తావించడానికే తన సంగీతం అంటూ భారతీయ ర్యాప్ కు కొత్త అర్థం చెబుతున్నాడు.