Swine Flu: కరోనా, స్వైన్ ఫ్లూ లక్షణాలు ఒకేలా ఉంటాయి... జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
- దేశంలో నిశ్శబ్దంగా పాకిపోతున్న స్వైన్ ఫ్లూ
- జూలై 31 వరకు 2,721 కేసులు నమోదు
- 44 మంది మృతి
కొంతకాలం కిందట హడలెత్తించిన స్వైన్ ఫ్లూ ఇప్పుడు మళ్లీ ఉనికిని చాటుకుంటోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో నమోదవుతున్న కేసులే అందుకు నిదర్శనం. ఓవైపు కరోనా భూతం రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న సమయంలో స్వైన్ ఫ్లూ నిశ్శబ్దంగా పాకిపోతుండడం పట్ల జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ లక్షణాలు, స్వైన్ ఫ్లూ వైరస్ లక్షణాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. స్వైన్ ఫ్లూ కూడా కరోనా లాగానే గొంతునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు వంటి లక్షణాలను కలిగిస్తుందని, కరోనా పరీక్షలతో పాటే రోగులకు ఇన్ ఫ్లుయెంజా పరీక్షలు కూడా నిర్వహించాలని అంటున్నారు.
కాగా, గత నెలాఖరు వరకు దేశంలో 2,721 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు వెల్లడైంది. కర్ణాటకలో 458, తెలంగాణలో 443, ఢిల్లీలో 412, తమిళనాడులో 253, యూపీలో 252 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 44 స్వైన్ ఫ్లూ మరణాలు సంభవించాయి. స్వైన్ ఫ్లూ ఎక్కువగా ఐదేళ్ల లోపు చిన్నారులకు, ఇతర వ్యాధులున్న వయసు పైబడినవారికి, గర్భవతులకు సోకుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.