Dream 11: ఐపీఎల్ కు కొత్త స్పాన్సర్ వచ్చింది.. వివో స్థానంలో 'డ్రీమ్ 11'

Dream eleven emerges IPL new sponsor for this season
  • ఈ ఏడాది స్పాన్సర్ గా తప్పుకున్న వివో
  • కొత్త స్పాన్సర్ కోసం బిడ్డింగ్ నిర్వహించిన బీసీసీఐ
  • రూ.222 కోట్లు కోట్ చేసిన డ్రీమ్ 11
  • టాటా సన్స్, బైజూస్ యాప్ లకు నిరాశ
ఐపీఎల్ కు కొత్త స్పాన్సర్ వచ్చింది. స్పోర్ట్స్ ఫాంటసీ సంస్థ డ్రీమ్ 11 ఈ సీజన్ లో ఐపీఎల్ కు స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఈ ఏడాది స్పాన్సర్ షిప్ హక్కుల నుంచి చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో తప్పుకోవడంతో బీసీసీఐ బిడ్లు ఆహ్వానించింది. రూ.222 కోట్లకు బిడ్ దాఖలు చేసిన డ్రీమ్ 11 ఈ సీజన్ లో ఐపీఎల్ ను స్పాన్సర్ చేస్తుందని ఐపీఎల్ చైర్మన్ బ్రజేశ్ పటేల్ వెల్లడించారు.

కాగా, బీసీసీఐ నిర్వహించిన స్పాన్సర్ షిప్ బిడ్డింగ్ లో పాల్గొన్న టాటా సన్స్ రూ.180 కోట్లు కోట్ చేయగా, అన్ అకాడమీ రూ.210 కోట్లు, బైజూస్ యాప్ రూ.125 కోట్లు కోట్ చేశాయి. చివరికి అత్యధికంగా కోట్ చేసిన డ్రీమ్ 11నే విజేతగా ప్రకటించారు. అయితే ఇది తాత్కాలిక ఒప్పందం అన్న సంగతి తెలిసిందే. ఈ స్పాన్సర్ షిప్ కేవలం మూడు నెలలకే పరిమితం. 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ స్పాన్సర్ షిప్ హక్కులు వివో వద్ద ఉన్నాయి.

భారత్-చైనా బలగాల మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు, తదనంతర పరిణామాలు చైనా సంస్థ వివోకు ప్రతికూలంగా మారాయి. భారత్ లో వివోకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఏడాది స్పాన్సర్ గా వైదొలగాలని వివో నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం బిడ్డింగ్ నిర్వహించింది. కరోనా కారణంగా భారత్ నుంచి తరలిపోయిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈ వేదికగా జరగనున్నాయి.
Dream 11
Sponsor
IPL 2020
VIVO
China
India
UAE

More Telugu News