Telangana: సెప్టెంబరు 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు నిర్ణయం
- కనీసం 15 రోజులైనా సభ జరగాలని భావిస్తున్న కేబినెట్
- సమావేశాలకు ఏర్పాట్లపై అధికారులకు స్పష్టం చేసిన కేసీఆర్
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరపాలని తీర్మానించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని సీఎం పలువురు క్యాబినెట్ మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది.
20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల కీలక అంశాలపై సమగ్ర చర్చ జరిగే అవకాశం ఉంటుందని సీఎం, మంత్రులు అభిప్రాయపడినట్టు ఆ ప్రకటనలో వివరించారు. కనీసం 15 రోజుల పాటైనా సమావేశాలు జరగాలని అందరూ భావిస్తున్నారని, ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని మంత్రులు, అధికారులకు సీఎం స్పష్టం చేశారని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని బిల్లులు, తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుందని, ఆ దిశగా సన్నద్ధం కావాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారని సీఎంవో వెల్లడించింది.