Wall Street Journal: ఫేస్ బుక్ ను నియంత్రిస్తున్న బీజేపీ... రాహుల్ విమర్శలకు మద్దతుగా అమెరికన్ మీడియా కథనాలు!

Rahul Gets Support from Wall Street Journal

  • బీజేపీ విద్వేష ప్రసంగాలను పక్కన బెడుతున్న ఫేస్ బుక్
  • కాంగ్రెస్ వ్యాఖ్యలపై భారీ ప్రచారం
  • ఫేస్ బుక్ భారత ఉన్నతోద్యోగి వ్యతిరేకించారు
  • అయినా బీజేపీకి అనుకూలంగా ఫేస్ బుక్
  • 'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రత్యేక కథనం

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ ద్వారా బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను రేపుతోందని, ఇండియాలో ఫేస్ బుక్ ను బీజేపీ ప్రభుత్వమే నియంత్రిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు మద్దతుగా నిలిచేలా అమెరికన్ మీడియాలో మోదీ సర్కారు ఫేస్ బుక్ ను కంట్రోల్ చేస్తోందంటూ వార్తలు రావడం కలకలం రేపింది. బీజేపీ నేతలు చేస్తున్న విద్వేష ప్రసంగాలను పక్కన పెడుతున్న ఫేస్ బుక్, కాంగ్రెస్ నేతలు ఒక్క చిన్న మాటన్నా, వాటిని విపరీతంగా ప్రచారం చేస్తోందని ప్రఖ్యాత 'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

"భారత రాజకీయాల్లో విద్వేష ప్రసంగాల విషయంలో రూల్స్ మారాయి. సంస్థ ప్రధాన అధికారి ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు" అనే అర్థం వచ్చేట్టుగా ఓ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ నేతలు చేసే అభ్యంతరకర వ్యాఖ్యలను ఫేస్ బుక్ ప్రచారం చేయడం లేదని ఆరోపించింది. ఈ విషయాన్ని భారత ఫేస్ బుక్ విభాగంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి ఎత్తి చూపారని, అయినా యాజమాన్యం పట్టించుకోలేదని, బీజేపీకి అనుకూలంగా ఫేస్ బుక్ వ్యవహరిస్తోందని ఆరోపించింది.

ఇక ఈ కథనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ఎత్తిచూపిన రాహుల్ గాంధీ, ఇండియాలో ఫేస్ బుక్, వాట్స్ యాప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తున్నాయని ఆరోపించారు.ఈ విషయాన్ని ఎట్టకేలకు అమెరికన్ మీడియా సైతం తెలుసుకున్నదని, ఫేస్ బుక్ గురించి అసలు నిజము ఇదేనని అన్నారు. వారి ప్రసంగాలు వైరల్ అవుతున్నాయని, విద్వేష ప్రసంగాలు మాత్రం బయటకు రావడం లేదని ఆరోపించారు.

ఆ వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సైతం రాహుల్ ఆరోపణలకు మద్దతిస్తూ, ట్వీట్ చేశారు. ఆ వెంటనే కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పందిస్తూ, ఓడిపోయిన వారు ప్రజలను మెప్పించలేక, ఇటువంటి ఆరోపణలు చేయడం సర్వసాధారణమేనని, సామాజిక మాధ్యమాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నియంత్రించడం అవాస్తవమని అన్నారు. కేంబ్రిడ్జ్ అనలిటికా, ఫేస్ బుక్ లను ఆయుధాలుగా చేసుకుని ఎన్నికలకు వెళ్లి ఓడిపోయి, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వారు ఇటువంటి ఆరోపణలే చేస్తారని మండిపడ్డారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో బీజేపీ నేతల విద్వేష ప్రసంగాలను వ్యతిరేకించిన ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ మిశ్రా, ఇప్పుడు మాట మార్చి, కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమ దిగ్గజాన్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణాన్ని వారు మరచినట్టున్నారని ఎద్దేవా చేయడం గమనార్హం.

  • Error fetching data: Network response was not ok

More Telugu News