Godavari River: భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న గోదావరి నీటిమట్టం... లోతట్టు ప్రాంతాల్లో భయాందోళనలు!
- ఈ మధ్యాహ్నానికి 52 అడుగుల నీటిమట్టం
- 1986లో 56 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- తెలంగాణ వ్యాప్తంగా వరద పరిస్థితులు
గత కొన్నిరోజలుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా వరద పరిస్థితులు నెలకొన్నాయి. దానికి తోడు ఎగువన కురుస్తున్న వర్షాలు, పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయికి సమీపానికి చేరుకుంది. కేంద్ర జలమండలి (సీడబ్ల్యూసీ) అధికారులు గోదావరిలో నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండడం పట్ల హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం రాత్రికల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుతుందని తెలిపారు.
నీటిపారుదల శాఖ అధికారులు భద్రాచలం వద్ద ఇప్పటికే రెండోసారి వరద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలంలో ఈ ఉదయానికి 48.1 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం మధ్యాహ్నానికి 52 అడుగులకు చేరింది. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో వరద హెచ్చరిక జారీ చేస్తారు. కేంద్ర జలమండలి వద్ద ఉన్న రికార్డుల ప్రకారం 1986లో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 56.6 అడుగులకు చేరింది.
కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో రికార్డు స్థాయికి నీటిమట్టం చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రస్థాయిలో వరద పరిస్థితిని పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 040-23450624 నెంబర్ కు ఫోన్ చేసి వరద పరిస్థితులపై సమాచారం తెలుసుకోవచ్చు.