Corona Virus: కరోనాకు వ్యాక్సిన్ వస్తే... తొలుత ఎవరికి ఇవ్వాలో తేల్చేసిన కేంద్రం!

Health Ministry Comments on Corona Vaccine

  • కొవిడ్ పోరాట యోధులకు తొలుత
  • శాస్త్రవేత్తలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, భారీ ఎత్తున తయారీ
  • వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి చౌబే

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు, కరోనాకు వ్యాక్సిన్ కనుగొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వేళ, వారు సఫలమై, ఇండియాకు వ్యాక్సిన్ వస్తే, దాన్ని తొలుత కరోనాపై పోరాడుతున్న యోధులకు అందించాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే వ్యాఖ్యానించారు. తాజాగా, న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రధాని ప్రకటించిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఎంతో ఉపయుక్తకరమైనదని అన్నారు.

"భారత ఆరోగ్యరంగంలో ఇదో చరిత్రాత్మక నిర్ణయం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ, ప్రధాని మోదీ దీన్ని ప్రకటించారు. భవిష్యత్తులో ఆరోగ్యరంగం పెనుమార్పులను చూడనుంది" అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ కోసం భారత శాస్త్రవేత్తలు సైతం ఎంతో శ్రమిస్తున్నారని, ఇండియాలో మూడు రకాల వ్యాక్సిన్లు వివిధ దశల్లో పరీక్షలను ఎదుర్కొంటున్నాయని, ఒకసారి శాస్త్రవేత్తలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, భారీ ఎత్తున తయారు చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని అశ్విని కుమార్ చౌబే తెలిపారు.

ప్రధాని ప్రకటించిన హెల్త్ కార్డ్ గురించి చెబుతూ, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఈ కార్డులను ఇస్తుందని, ఈ కార్డులో వ్యక్తి సమస్య మెడికల్ హిస్టరీ ఉంటుందని, దీని సాయంతో ఏ డాక్టర్ అయినా, అప్పటివరకూ జరిగిన ట్రీట్ మెంట్, వాడిన ఔషధాల గురించి తెలుసుకోవచ్చని, ఆ తరువాత తగిన చికిత్స చేసేందుకు వీలు కలుగుతుందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News