Pakistan: దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు.. సౌదీతో చర్చలకు పాక్ రెడీ!

Pakistan army chief to visit Saudi Arabia

  • కశ్మీర్‌పై మద్దతు కోరి భంగపడిన పాకిస్థాన్
  • అండగా నిలవకపోవడంతో సౌదీపై తీవ్ర విమర్శలు
  • ఆదివారం సౌదీ వెళ్లనున్న పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా

సౌదీ అరేబియాపై తీవ్ర విమర్శలు చేసి సంబంధాలను చేజేతులా దెబ్బతీసుకున్న పాకిస్థాన్ ఇప్పుడు నష్ట నివారణ చర్యల్లో పడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ బజ్వా ఆదివారం సౌదీ పర్యటనకు వెళ్లనున్నారు. బజ్వా పర్యటన విషయాన్ని పాక్ ఆర్మీ ధ్రువీకరించింది.

కశ్మీర్ అంశంపై సౌదీ అరేబియా సహా ఇతర ముస్లిం దేశాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్.. అందులో భాగంగా సౌదీని కూడా మద్దతు కోరింది. అయితే, కశ్మీర్ విషయంలో ఆ దేశానికి స్పష్టమైన వైఖరి ఉండడంతో పాక్‌కు మద్దతు ఇచ్చేందుకు సౌదీ ముందుకు రాలేదు. దీంతో ఉడికిపోయిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీలు సౌదీ అరేబియాపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సౌదీ రాజు సాల్మన్ పాకిస్థాన్‌కు చమురు సరఫరా నిలిపివేశారు.

మరోవైపు, గతంలో సౌదీ నుంచి తీసుకున్న మూడు బిలియన్ డాలర్ల రుణంలో బిలియన్ డాలర్లను గతవారం పాకిస్థాన్ తిరిగి చెల్లించింది. ఈ చెల్లింపు వెనక సౌదీ ఒత్తిడి ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సౌదీని తిరిగి ప్రసన్నం చేసుకోకుంటే పరిస్థితులు మున్ముందు మరింత దారుణంగా ఉంటాయని భావిస్తున్న పాకిస్థాన్, సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే ఆదివారం ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వా సౌదీ పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం.

Pakistan
Saudi Arabia
Jammu And Kashmir
ties
  • Loading...

More Telugu News