Mobs: బెంగళూరులో పోలీసులపై గెరిల్లా తరహా దాడులకు పాల్పడిన అల్లరి మూకలు!

Mobs in Bengaluru attacked on police in guerrilla style

  • విధ్వంసానికి కారణమైన ఫేస్ బుక్ పోస్టు
  • బెంగళూరు నగరంలో విధ్వంసం
  • చీకటి మాటున పొంచి పోలీసులపై దాడులు

ఓ ఫేస్ బుక్ పోస్టు బెంగళూరు నగరంలో తీవ్రమైన విద్వేషాలు రగల్చడమే కాదు, అల్లర్లకు కూడా దారితీసింది. ఈ సందర్భంగా పోలీసులకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. అల్లర్లను అణచివేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులను అల్లరి మూకలు ముప్పుతిప్పలు పెట్టాయి. గెరిల్లా తరహా దాడులతో పోలీసులనే విస్మయానికి గురిచేశారు. విధ్వంసం ఎక్కువగా జరిగిన కేజీ హళ్లి, డీజే హళ్లి, కవలబైరాసంద్ర ప్రాంతాలకు అధికారులు అదనపు బలగాలను తరలించారు.

అయితే, రాత్రివేళ వీధి దీపాల వెలుగులో ముందుకు సాగుతున్న పోలీసులు ఒక్కసారిగా అంధకారంలో మునిగిపోయారు. అల్లరి మూకలు ముందుగా వీధి దీపాలను గురిచూసి కొట్టాయి. ఆపై చీకట్లు అలముకోగానే ఒక్కసారిగా పోలీసులపై దాడి మొదలైంది. పోలీసులు మరింత ముందుకు వెళ్లే వీల్లేకుండా ఎక్కడికక్కడ రోడ్లను బ్లాక్ చేశారు. అక్కడి నుంచి పోలీసులపై దాడి ఉద్ధృతమైంది.

పూలకుండీలు, చిన్నవి, పెద్దవి వివిధ సైజుల్లో ఉన్న రాళ్లు, సీసాలు, టైర్లు, చెక్క ముక్కలు, ఇటుకలు.. ఇలా రకరకాల వస్తువులు పోలీసులపై జడివానలా వచ్చి పడ్డాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించేలోపే చాలామంది పోలీసులు గాయపడ్డారు. వారి కవచాలు విరిగిపోయాయి. దాంతో విధిలేని పరిస్థితుల్లో ఫైరింగ్ ఆర్డర్లు ఇవ్వాల్సి వచ్చిందని పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. పలు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి, బాష్పవాయుగోళాలు పేల్చిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని అన్నారు. కాగా ఈ దాడుల్లో 70 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News