India: గడచిన వారం రోజులుగా భారత్ లో కరోనా వీర విజృంభణ: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్

Corona Situation Dagerous in India

  • కరోనా కేసుల్లో 23 శాతం, మరణాల్లో 15 శాతం ఇండియాలో
  • 4 నుంచి 10 మధ్య 4.11 లక్షల కేసులు
  • 24 రోజుల్లోనే 10 లక్షల నుంచి 22 లక్షలకు కేసులు
  • పరిస్థితి ఆందోళనకరమన్న డబ్ల్యూహెచ్ఓ

గడచిన వారం రోజుల వ్యవధిలో ప్రపంచంలోని మొత్తం కరోనా కేసుల్లో 23 శాతం, మరణాల్లో 15 శాతం ఇండియాలోనే సంభవించడం ఆందోళన కలిగిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యాఖ్యానించింది. ఇండియాలో ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోందని, రోజువారీ కేసుల్లో, తొలి రెండు స్థానాల్లో ఉన్న అమెరికా, బ్రెజిల్ లను ఇండియా దాటేసిందని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు వెల్లడించాయి.

ఈ నెలలో 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ భారత్ లో 4,11,379 కొత్త కేసులు, 6,251 మరణాలు సంభవించాయని, ఇదే సమయంలో అమెరికాలో కేసుల సంఖ్య 3,69,575 కాగా, 7,232 మంది చనిపోయారని తెలిపింది. బ్రెజిల్ లో 3,04,535 కేసులు, 6,914 మరణాలు నమోదయ్యాయని, మరణాల విషయంలో మాత్రమే ఇండియా కొంత మెరుగైన గణాంకాలను చూపుతోందని వ్యాఖ్యానించింది.

కాగా, నాలుగు రోజుల పాటు సగటున 60 వేలను దాటిన కేసులు నిన్న మాత్రం 52 వేలకు పరిమితం కాగా, మొత్తం కేసుల సంఖ్య 22.68 లక్షలకు చేరిన సంగతి తెలిసిందే. తొలి లక్ష కేసులు నమోదు కావడానికి 110 రోజుల సమయం పట్టగా, ఆపై 10 లక్షల మార్క్ ను చేరుకునేందుకు 59 రోజులు మాత్రమే పట్టింది. ఆపై కేవలం 24 రోజుల్లోనే కేసుల సంఖ్య 22 లక్షలను దాటింది. ఇదే సమయంలో రికవరీలు కూడా వేగంగానే పెరుగుతున్నాయి. రికవరీ రేటు 70 శాతంగా ఉండగా, ఇంతవరకూ 15.83 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు. మరణాల రేటు 2 శాతం నుంచి 1.99 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇక టెస్టుల విషయానికి వస్తే, ప్రతి పది లక్షల మందిలో 18,300 మందికి మాత్రమే ఇండియాలో టెస్టులు జరుగుతుండగా, ఈ విషయంలో అమెరికా ముందు నిలిచి, 1,99,803 మందికి టెస్టులు చేస్తుండగా, బ్రెజిల్ 62,200 మందికి పరీక్షలు చేస్తోంది. ఆగస్టు 9న ఇండియాలో అత్యధిక ఒకరోజు కేసులుగా 64,399 పాజిటివ్ లు నిర్ధారణ అయ్యాయి. ఇండియాలో టెస్టుల సంఖ్యను పెంచితే మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అభిప్రాయం.

  • Loading...

More Telugu News