Sachin pilot: నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని.. 30 రోజులు ఎంతో ఓపికతో వ్యవహరించా: సచిన్ పైలట్
- పైలట్ వర్గ డిమాండ్లను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు
- 14 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్న పైలట్ వర్గం
- తానెలాంటి పదవీ కోరలేదన్న సచిన్
తన గురించి ఎన్నో తప్పుడు వార్తలు ప్రచారం చేసినప్పటికీ ఈ నెల రోజులు ఎంతో ఓపికగా ఉన్నానని, ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనేనని రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో సోమవారం భేటీ అనంతరం నిన్న సాయంత్రం పైలట్ జైపూర్ చేరుకున్నారు.
విమానాశ్రయంలో మద్దతుదారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సచిన్ వర్గం డిమాండ్లను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఫలితంగా రాజస్థాన్ కాంగ్రెస్‌లో నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగిపోయినట్టయింది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో పైలట్ వర్గం ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
జైపూర్ చేరుకున్న అనంతరం సచిన్ మాట్లాడుతూ.. పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తానెలాంటి పదవినీ కోరలేదని అన్నారు. రాజకీయాల్లో సమస్యలు, విధానాల పరంగానే పనిచేయాలని, వ్యక్తిగత శత్రుత్వం కూడదని పేర్కొన్నారు.