Apple: 2 ట్రిలియన్ డాలర్లకు యాపిల్ విలువ... బిలియనీర్ల క్లబ్ లోకి చేరిపోయిన టిమ్ కుక్!
- గత వారంలో 5 శాతం పెరిగిన యాపిల్ విలువ
- దీంతో పెరిగిన టిమ్ కుక్ సంపద
- వివరాలు వెల్లడించిన బ్లూమ్ బర్గ్ ఇండెక్స్
యాపిల్ సంస్థకు సీఈఓగా బాధ్యతలు చేపట్టిన 9 సంవత్సరాల తరువాత టిమ్ కుక్, బిలియనీర్ల క్లబ్ లోకి చేరిపోయారు. యాపిల్ ఈక్విటీ విలువ గత వారంలో 5 శాతం పెరగడంతో, సంస్థ మొత్తం విలువ 2 ట్రిలియన్ డాలర్లకు చేరువైంది. దీంతో ఆ మేరకు టిమ్ కుక్ సంపద కూడా పెరిగింది. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మరణించే సమయానికి యాపిల్ విలువ 350 బిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడది భారీగా పెరిగింది. దీంతో తాము స్థాపించిన కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తూ, బిలియనీర్లుగా మారిన వారి జాబితాలో టిమ్ కుక్ కూడా చేరారు.
బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా గణాంకాల ప్రకారం ఆయన సంపద బిలియన్ డాలర్లకు పెరిగింది. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ఆధారంగా ఆయన నికర సంపదను విశ్లేషించామని బ్లూమ్ బర్గ్ తెలిపింది. కాగా, తన సంపదలో అధిక మొత్తాన్ని దానధర్మాలకే వెచ్చిస్తానని టిమ్ కుక్ 2015లోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కోట్ల విలువైన యాపిల్ వాటాలను ఆయన బహుమతిగా ఇచ్చారు. ఎన్నో చారిటబుల్ సంస్థలకు ఆయన సాయపడిన సంగతి తెలిసిందే.