Supreme Court: పరీక్షలు రద్దు చేసి, మమ్మల్ని డిగ్రీలు ఇమ్మంటే ఎలా?: సుప్రీంకోర్టులో యూజీసీ వాదన
- డిగ్రీల ప్రదానంపై నిబంధనల అధికారం మాదే
- విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సిందే
- యూజీసీ తరఫున వాదనలు వినిపించిన తుషార్ మెహతా
విపత్తు నిర్వహణ చట్టం పేరు చెప్పి, రాష్ట్రాల పరిధిలో పరీక్షలను రద్దు చేసి, ఆపై సర్టిఫికెట్లను ఇవ్వాలని తమను కోరడాన్ని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ తప్పుపట్టింది. డిగ్రీలను ప్రదానం చేయడానికి సంబంధించిన నియమాలు, నిబంధనలను రూపొందించే అధికారం తమకు మాత్రమే ఉందని, దీన్ని రాష్ట్రాలు మార్చలేవని సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించింది. సెప్టెంబర్ 30 లోపల ఆఖరు సంవత్సరం ఎగ్జామ్స్ ను నిర్వహించాల్సిందేనని తేల్చింది.
యూజీసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ, పలు ప్రాంతాలకు చెందిన 31 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాషణ్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారించింది. యూజీసీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ విషయంలో రాష్ట్రాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నాయని, విద్యార్థుల డిగ్రీలను గుర్తించకపోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు.
విద్యార్థులు తమ చదువును కొనసాగించాలని, పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉండాలని, పరీక్షలు జరిపించకుండా డిగ్రీలను ఇచ్చే అవకాశాలే లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం, యూజీసీ ఆదేశాలను విపత్తు చట్టం అధిగమించగలదా? అని ప్రశ్నించింది. దీనికి 14వ తేదీలోగా సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.