Sachin Pilot: నా సమస్య చాలా ముఖ్యమైనది, సైద్ధాంతికమైనది... గొంతెత్తి చాటాల్సిందే: సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్య
- రాహుల్, ప్రియాంకలతో చర్చల తరువాత సచిన్ పైలట్
- నేను ఎదుర్కొన్న ఇబ్బందులను ఎంతో మంది చూస్తున్నారు
- అశోక్ గెహ్లాట్ పై నమ్మకం ఉంది
- సమస్యలను పార్టీలోనే పరిష్కరించుకుంటామని వెల్లడి
దాదాపు నెల రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీపై తిరుగుబావుటాను ఎగురవేసి, దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపిన రాజస్థాన్ యువనేత సచిన్ పైలట్, గత రాత్రి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను కలిసి, తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని, గాంధీ కుటుంబానికి విధేయుడినని చెప్పిన సచిన్ పైలట్, ఆపై మీడియాతో మాట్లాడారు. తాను అనుభవిస్తున్న సమస్యను గొంతెత్తి చాటాల్సిందేనని అన్నారు.
తాను, కాంగ్రెస్ నేతగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని, ఇటువంటి సమస్యలే తనవంటి పలువురు నేతలు ఎదుర్కొంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యలన్నీ సైద్ధాంతికమైనవని, వీటిని బహిరంగంగా చెప్పాల్సిందేనని, వీటిని పార్టీ అధిష్ఠానం పరిష్కరించాలని అన్నారు. తనకు సమయం ఇచ్చి, తనతో మాట్లాడినందుకు ప్రియాంకా గాంధీకి కృతజ్ఞతలని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తరువాత అశోక్ గెహ్లాట్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారని, ఆయనపై తనకు గౌరవం ఉందని అన్నారు.
తాను ఎదుర్కొన్న సమస్యలను మీడియా ముందు చెప్పలేనని, వాటిని పార్టీలోనే అంతర్గతంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నానని సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్ఠానం తన సమస్యలపై, యువతరం వాంఛలపై దృష్టిని సారిస్తుందనే భావిస్తున్నానని, దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే ఉందని నమ్ముతున్నానని అన్నారు.
కాగా, అంతకుముందు ఇటీవల ప్రియాంకా గాంధీతో సచిన్ పైలట్ సమావేశమైన వేళ, రాజస్థాన్ రాష్ట్రానికి తనను ముఖ్యమంత్రిని చేయాలని, కావాలంటే అందుకు ఏడాది సమయం తీసుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే. పార్టీలో యువతరాన్ని ప్రోత్సహించాలని, సీనియర్లను పక్కన బెడితేనే తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి బాటలు వేయవచ్చని పలువురు సూచిస్తున్న వేళ, సచిన్ డిమాండ్ పై కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.