Andhra Pradesh: ఏపీలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన సర్కారు

new policy in ap

  • పరిశ్రమలకు ఇచ్చే రాయితీల ప్రకటన
  • 2020-2023 మధ్య అమలులో ఉండనున్న పాలసీ
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు
  • 'వైఎస్సార్‌ వన్' పేరిట విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని పరిశ్రమలకు ఇచ్చే రాయితీలతో పాటు వాటికి అందించే మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు వంటి అంశాలను ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా వివరించారు. నూతన పారిశ్రామిక విధానాన్ని వారిరువురు కలిసి ప్రారంభించారు.

 ఈ పాలసీ 2020-2023 మధ్య అమలులో ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించారు. 'వైఎస్సార్‌ వన్' పేరిట మల్టీ బిజినెస్ సెంటర్, పెట్రో కెమికల్స్ తో పాటు కీలక రంగాల్లో పెట్టుబడులకు ఇందులో ప్రాధాన్యతను ఇచ్చారు.

ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంపదను సృష్టించే విధంగా, పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తూ కొత్త పాలసీని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నైపుణ్యం కలిగిన యువతకు పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం మాత్రం అమలుకు సాధ్యం కాని అంశాలను రూపొందించిందని విమర్శించారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని చెప్పుకొచ్చారు. ఏపీలో పారిశ్రామిక రంగంలో మహిళలకు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని, వారిని ప్రోత్సహించే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చారని చెప్పారు. జగన్‌ విజన్‌కు ఈ‌ పాలసీ ఓ నిదర్శనమని తెలిపారు. ఇకపై రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ఉంటుందని, పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ఈ పాలసీ ఉంటుందని వివరించారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు స్టాంప్ డ్యూటీ, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ కల్పిస్తామని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ పాలసీ ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News