Sanjay Dutt: గత రాత్రి ఊపిరి తీసుకోలేకపోయిన సంజయ్ దత్... హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

Actor Sunjay Dutt Rushed to Leelavati Hospital

  • లీలావతి ఆసుపత్రికి తరలింపు
  • కరోనా పరీక్షలు చేస్తే నెగటివ్
  • పరిస్థితిని సమీక్షిస్తున్నామన్న వైద్యులు
  • కోలుకుంటానన్న నమ్మకం ఉందన్న సంజయ్ దత్

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శనివారం రాత్రి ఊపిరి పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడగా, అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సంజయ్ దత్ కు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ప్రొటోకాల్ ప్రకారం అతనికి కోవిడ్-19 టెస్ట్ ను నిర్వహించగా, నెగటివ్ వచ్చింది. సంజయ్ వయసు 61 సంవత్సరాలు కాగా, ఆక్సిజన్ స్థాయి పడిపోయిందని, గుండెల్లో అసౌకర్యంగా ఉందని కూడా ఆయన వెల్లడించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం అంచనా వేస్తోందని అధికారులు తెలిపారు.

ఆసుపత్రిలో చేరిన తరువాత ఆసుపత్రి నుంచి తన ఆరోగ్యంపై సంజయ్ దత్ ట్వీట్ చేశారు. "అందరికీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. నేను బాగానే ఉన్నాను. ప్రస్తుతం మెడికల్ అబ్జర్వేషన్ లో ఉన్నాను. నా కొవిడ్-19 రిపోర్టు నెగటివ్ వచ్చింది. లీలావతి ఆసుపత్రిలోని వైద్యుల సహకారం, నర్సులు, ఇతర సిబ్బంది సేవలతో నేను ఒకటి, రెండురోజుల్లోనే కోలుకుంటానని భావిస్తున్నాను. నా కోసం ప్రార్థిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు" అని వ్యాఖ్యానించారు.

కాగా, ఇటీవలి కాలంలో పలువురు బాలీవుడ్ నటులు వరుసపెట్టి లీలావతి ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరుతున్న సంగతి తెలిసిందే. అమితాబ్ ఫ్యామిలీ కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందిందన్న సంగతి తెలిసిందే. బచ్చన్ కుటుంబాన్ని కరోనా మహమ్మారి పట్టుకోగా, వారంతా కోలుకుని ఇల్లు చేరుకున్నారు. ఇటీవలే సంజయ్ దత్ పుట్టిన రోజు జరుగగా, 'కేజీఎఫ్: చాప్టర్ 2'లోని తన లుక్ 'అధీరా'ను ఆయన అభిమానులతో పంచుకున్నారు కూడా.

  • Error fetching data: Network response was not ok

More Telugu News