Girl: ఫీజుల కోసం ఫోన్ దొంగిలించిన విద్యార్థిని... జాలిపడిన ప్రైవేటు డిటెక్టివ్
- ఫోన్ తాకట్టు పెట్టిన విద్యార్థిని
- తన తెలివితేటలతో ఆ అమ్మాయిని పట్టేసిన డిటెక్టివ్
- పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వదిలేసిన వైనం
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ విద్యార్థిని ఫీజుల కోసం ఫోన్ దొంగిలించగా, ఆమెకు అనూహ్య పరిణామం ఎదురైంది. 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల అమ్మాయి స్కూలు ఫీజుల కోసం దొంగగా మారింది. ఓ వ్యక్తి నుంచి ఫోన్ తస్కరించి, దాన్ని రూ.2,500కి తాకట్టు పెట్టింది. అయితే, ఆమె ఎవరి నుంచి ఫోన్ దొంగిలించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి పేరు ధీరజ్ దూబే. ఓ ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీకి అధిపతి.
ఆ డిటెక్టివ్ తన తెలివితేటలతో తన ఫోన్ ఎవరు కొట్టేశారో ఇట్టే పట్టేశాడు. నేరుగా ఆ అమ్మాయి వద్దకు వెళ్లి ప్రశ్నించగా, తన దీన స్థితి వివరించింది. చెల్లించాల్సిన స్కూలు ఫీజు నోటీసులను ఆ డిటెక్టివ్ కు చూపింది. దాంతో ఆ డిటెక్టివ్ మానవతా దృక్పథంతో స్పందించి, రూ.2,500 చెల్లించి ఫోన్ విడిపించడమే కాదు, ఆ విద్యార్థినికి అవసరమైన డబ్బును కూడా ఇచ్చాడు. పైగా పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయకుండా వదిలేశాడు.
డిటెక్టివ్ ధీరజ్ దూబే మీడియాతో మాట్లాడుతూ "ఆ ఫోన్ ను అమ్మేయలేదని ఆ విద్యార్థిని చెప్పింది. తనకు ఉద్యోగం వస్తే ఆ ఫోన్ విడిపించి మళ్లీ నాకు ఇచ్చేయాలనుకుందట. ఈ విషయం నన్నెంతో కదిలించింది" అని వివంరించాడు. అంతేకాదు, ఈ విషయం తెలియడంతో, ఆ అమ్మాయికి సాయం చేసేందుకు ఓ డాక్టర్, టీచర్ ముందుకొచ్చారు. ఆమె విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చులను తాము భరిస్తామని హామీ ఇచ్చారు.