Vellampalli Srinivasa Rao: సీఎం జగన్ కు సహకరిస్తారా? లేక, రాజీనామాలు చేసి ప్రజల తీర్పు కోరతారా?: చంద్రబాబుకు సవాల్ విసిరిన వెల్లంపల్లి
- చంద్రబాబు ప్రకటనలు మానుకోవాలని హితవు
- జూమ్ కళ్లద్దాలు తీసి చూడాలంటూ వ్యాఖ్యలు
- ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలన్న వెల్లంపల్లి
ఏపీకి మూడు రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం చట్టం చేసిన నేపథ్యంలో అధికార, విపక్ష టీడీపీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు డెడ్ లైన్లతో హోరెత్తిస్తుండగా, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తాజాగా చంద్రబాబుకు ప్రతి సవాల్ విసిరారు. కలలు సాకారం కావాలంటే చంద్రబాబు ప్రకటనలు చేయడం మానుకోవాలని, జూమ్ కళ్లద్దాలు తీసి చూడాలంటూ హితవు పలికారు. ఈ దిశగా పాటు పడాలని టీడీపీ ఎంపీ కేశినేని నానియే చెబుతున్నారని వెల్లడించారు.
"ఇప్పటికైనా విమర్శలు మానుకుని, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న సీఎం జగన్ కు సహకరిస్తారో... లేక మీరు, మీ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల తీర్పుకోరతారో తేల్చుకోవాలి" అంటూ వెల్లంపల్లి స్పష్టం చేశారు. ఈ మేరకు 'డెడ్ లైన్ల బాబుకు వెల్లంపల్లి సవాల్' అంటూ ట్వీట్ చేశారు.