IAF: ఆకతాయిల పని... ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి భారత యుద్ధ విమానం!
- మిగ్-23ని అమ్మకానికి పెట్టిన వైనం
- ధర రూ.9.99 కోట్లుగా ప్రకటన
- అలీగఢ్ వర్సిటీలో ప్రదర్శనకు ఉండే యుద్ధ విమానం
- బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న వర్సిటీ
ఓఎల్‌ఎక్స్‌లో ఓ వ్యక్తి అలీగఢ్ ముస్లిం వర్సిటీలో ఉన్న యుద్ధ విమానం మిగ్-23ని అమ్మకానికి పెట్టాడు. మొబైల్ ఫోన్లు, వాహనాలు, గృహోపకరణాలు వంటి వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి యూజర్లు ఓఎల్‌ఎక్స్‌ను వాడతారు. అందులో ఓ ఆకతాయి ఏకంగా యుద్ధ విమానాన్నే ఇందులో అమ్మకానికి పెట్టాడు. దాని ధర రూ.9.99 కోట్లని పేర్కొన్నాడు.
భారత వాయుసేన 2009లో మిగ్-23 యుద్ధ విమానాన్ని ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి బహుమతిగా ఇచ్చింది. ఆ వర్శిటీ ఆవరణలోని ఇంజనీరింగ్ కాలేజీ ఎదుట దాన్ని ప్రదర్శనకు ఉంచారు. ఈ విమానాన్ని కార్గిల్ యుద్ధంలోనూ వాడారు. ఇప్పుడు ఆ విమానాన్ని ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి ఉంచడాన్ని చూస్తోన్న వినియోగదారులు ముక్కుమీద వేలేసుకుంటున్నారు.
ఎవరో యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బ తీయడానికే ఈ విమానం ఫొటోను ఓఎల్‌ఎక్స్‌లో పెట్టారని ఆ వర్సిటీ సిబ్బంది అంటున్నారు. ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పని అని చెబుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ విమానం ఫొటోను ఓఎల్‌ఎక్స్ వెబ్‌సైట్ నుంచి తీసేయించామని తెలిపారు.