Berut: బీరుట్ లో భారీ పేలుడు... 73 మందిని మందిని బలిగొన్న వీడియో ఇదిగో!
- అమోనియం నైట్రేట్ కర్మాగారంలో పేలుడు
- కమర్షియల్ ప్రాంతంలో పేలుడుతో భారీ నష్టం
- రక్తమోడుతూ పరుగులు పెట్టిన ప్రజలు
లెబనాన్ రాజధాని బీరుట్ లో జరిగిన ఓ పేలుడుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కి, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ ప్రమాదంలో 73 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం. దాదాపు కిలోమీటర్ కు పైగా ఈ భారీ పేలుడు ప్రభావం కనిపించినట్టు తెలుస్తోంది. తొలుత పొగ వస్తుండగా, అదే ప్రాంతంలో పెద్ద పేలుడు సంభవించగా, ఆపై భారీ ఎత్తున నారింజ రంగు పొగ ఆకాశంలోకి కమ్మేసింది. ఈ ఘటనను దూరంగా ఉన్న పలువురు తిలకించారు కూడా. అమోనియం నైట్రేట్ ను నిల్వ ఉంచిన కర్మాగారంలో ఈ పేలుడు జరుగగా, నగర వ్యాప్తంగా ప్రకంపనలు నమోదయ్యాయి.
"నేను పేలుడు శబ్దాన్ని విన్నాను. ఆ వెంటనే పుట్టగొడుగులా పొగ కనిపించింది" అని ఆ క్షణాలను స్వయంగా చూసిన నగర పరిధిలోని మన్సౌరే ప్రాంత వాసి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ పేలుడు సమీపంలోని ఎన్నో అపార్టుమెంట్లను కమ్మేసిందని ఆయన తెలిపారు. ఈ పేలుడు హమ్రా కమర్షియల్ ప్రాంతంలో సంభవించగా, అక్కడి ప్రతి షాపూ దెబ్బతిందని, అన్నీ ధ్వంసమయ్యాయని ఆ సమయంలో అక్కడే ఉన్న వార్తా సంస్థ 'ఏఎఫ్పీ' ప్రతినిధి వ్యాఖ్యానించారు. రక్తమోడుతూ, గాయపడుతున్న ఎంతో మంది పరుగులు పెడుతూ వచ్చారని, వారిలో చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
ఎన్నో కార్లు, ఇతర వాహనాలు పేలుడుతో ధ్వంసమయ్యాయని, మొత్తం పోర్ట్ ప్రాంతాన్ని పొగ కమ్మేసిందని తెలుస్తుండగా, ఆ వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను ప్రారంభించాయి. వేలాదిమంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.