Street Dog: వీధి శునకాన్ని సేల్స్ పర్సన్ గా నియమించుకున్న హ్యుండాయ్ షోరూం
- బ్రెజిల్ లో వీధి కుక్క అదృష్టం
- వీధి కుక్కను దత్తత తీసుకున్న హ్యుండాయ్ షోరూం
- టక్సన్ ప్రైమ్ గా నామకరణం
శునకాలు మనుషులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతాయని తెలిసిందే. కుక్కలను ఇళ్లలో పెంచుకోవడం సర్వసాధారణమైన విషయం. ఇక పోలీసు శాఖలో విధుల కోసం ఉపయోగించడం ఎప్పటినుంచో ఉంది. అయితే, బ్రెజిల్ లో ఓ వీధి కుక్కను హ్యుండాయ్ షోరూంలో సేల్స్ పర్సన్ గా నియమించడం విశేషం అని చెప్పాలి. ఓ వీధి కుక్కను దత్తత తీసుకున్న ఆ షోరూం నిర్వాహకులు దానికి కస్టమర్లను ఆహ్వానించే పని అప్పగించారు.
ఆ శునకానికి టక్సన్ ప్రైమ్ అని నామకరణం చేసి, మెడలో ఓ ఐడీ కార్డు కూడా తగిలించారు. హ్యుండాయ్ కంపెనీ తయారుచేసే ఓ కారు పేరు టక్సన్. ఆ పేరునే ఈ కుక్కకు పెట్టారు. ఆ కుక్కకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో 28 వేల వరకు అభిమానులున్నారు. షోరూంకు వచ్చిన కస్టమర్ల కార్లను చెక్ చేయడం, కస్టమర్లు షోరూంలోకి వెళ్లేటప్పుడు తోకాడించుకుంటూ వారిని సాదరంగా తొడ్కొని వెళ్లడం టక్సన్ ప్రైమ్ విధి. అంతేకాదు, షోరూం సిబ్బందికి నిర్వహించే సమావేశాల్లో ఇది కూడా పాల్గొంటుంది.