Donald Trump: విదేశీ ఉద్యోగులపై మరో కీలక నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్
- ఫెడరల్ ఏజెన్సీలు విదేశీ కార్మికులను తీసుకోకుండా నిర్ణయం
- హెచ్-1బీ వీసాలో ఉన్న వారిని నియమించొద్దు
- అమెరికన్లను మాత్రమే నియమించుకొనేలా నిర్ణయం
- హెచ్-1బీలో తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ కార్మికులొద్దు
కరోనాతో తమ దేశ ప్రజలకు ఉద్యోగాల పరంగా ఇబ్బందులు రాకుండా అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ ఏజెన్సీలు విదేశీ కార్మికులను, హెచ్-1బీ వీసాలో ఉన్న వారిని నియమించకుండా నిరోధించే ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. అంతకు ముందు శ్వేతసౌధంలో ట్రంప్ మాట్లాడుతూ... ఫెడరల్ ప్రభుత్వం అమెరికన్లను మాత్రమే నియమించుకొనేలా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నానని ప్రకటన చేశారు.
తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ కార్మికుల కోసం కష్టపడి పనిచేసే తమ దేశ పౌరులను తొలగించే నిర్ణయాలను తాను ఒప్పుకోబోనని తెలిపారు. అధిక జీతాలు తీసుకునే నిపుణుల కోసం మాత్రమే హెచ్-1బీ వీసాలను వినియోగించాలని, అంతేగానీ, తక్కువ జీతాలకు పనిచేసే వారిని కాదని చెప్పారు. కాగా, 2020 చివరి వరకు హెచ్-1బీ వీసాలతో పాటు ఇతర విదేశీ వీసాలను ఇప్పటికే అమెరికా రద్దు చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమెరికన్లకు ఉద్యోగాల విషయంలో ట్రంప్ ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుండడం గమనార్హం.