102 Ambulance: కారులో వచ్చి 102 అంబులెన్స్‌ను అపహరించిన దుండగులు

102 Ambulance theft by three people in khammam
  • మెకానిక్ పేరుతో అంబులెన్స్ డ్రైవర్ నుంచి తాళాలు
  • ట్రయల్ వేస్తామని తీసుకెళ్లి పరార్
  • పోలీసులు వెంబడించడంతో ఇల్లెందు వద్ద వాహనం వదిలిన దుండగులు
కారులో వచ్చిన ముగ్గురు దుండగులు తాము మెకానిక్‌లమని చెప్పి 102 అంబులెన్స్‌ను అపహరించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో జరిగింది. స్థానిక ప్రభుత్వాసుపత్రి పరిధిలో తిరిగే 102 అంబులెన్స్ వద్దకు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చారు. తమను తాము మెకానిక్‌లుగా పరిచయం చేసుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్ నుంచి తాళాలు తీసుకుని ట్రయల్ వేస్తామంటూ వారిలో ఒకడు వాహనం తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత కారులో ఉన్న ఇద్దరూ వెళ్లిపోయారు.

అయితే, అంబులెన్స్ తీసుకుని వెళ్లిన వ్యక్తి ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానించిన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన వారు కాచనపల్లి, ఇల్లెందు పోలీసులకు సమాచారం అందించారు. వారు అంబులెన్స్‌ను వెంబడించడంతో ఇల్లెందు వద్ద వాహనాన్ని వదిలి పరారయ్యారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని ఆసుపత్రికి అప్పగించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
102 Ambulance
Yellandu
theft
Bhadradri Kothagudem District

More Telugu News