Pawan Kalyan: భావితరాలు కూడా ప్రధాని మోదీకి రుణపడి ఉంటాయి: పవన్ కల్యాణ్
- నూతన విద్యావిధానం ప్రకటించిన కేంద్రం
- ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్
- ఈ క్రతువులో రాష్ట్రాలన్నీ పాలుపంచుకోవాలని సూచన
దేశంలో సుదీర్ఘకాలంగా సంస్కరణలకు నోచుకోని రంగంగా ఉన్న విద్యా వ్యవస్థను సమూలంగా మార్చివేస్తూ కేంద్రం సరికొత్త విద్యావిధానం ప్రకటించింది. దీనిపై పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీకి, ఆయన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
"భారతీయ విద్యా వ్యవస్థలో చారిత్రక సంస్కరణలు తీసుకువచ్చినందుకు మీకు, మీ టీమ్ మెంబర్లకు ధన్యవాదాలు. రాబోయే తరాల వారు కూడా మీకు ప్రగాఢంగా రుణపడి ఉంటారు. ఇది నిజంగా విప్లవాత్మకమైన విద్యావిధానం. విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ, వారిలో ఆందోళనకు కారణమవుతున్న అర్థంలేని పాతకాలపు విద్యావిధానం, వృత్తి విద్యాశిక్షణ విధానం దశాబ్దాల తరబడి తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. భారతీయ భాష అంతకన్నా నిరాదరణకు గురైంది.
తీసుకుంటే సైన్స్ కోర్సులు, అవి కాకపోతే ఆర్ట్స్ కోర్సులు అన్నట్టుగా ఇప్పటివరకు ఓ మూస ధోరణిలో వెళ్లారు. విద్యార్థులకు మరో ఆప్షన్ ఇవ్వలేని నిర్బంధ వ్యవస్థకు ఇన్నాళ్లకు ముగింపు వచ్చింది. 34 ఏళ్ల తర్వాత 21వ శతాబ్దం కోసం సమగ్రమైన, సంపూర్ణమైన, బలమైన విద్యావిధానం వచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి, ఈ చారిత్రక సంస్కరణల రూపకల్పనలో ఆయనకు సహకరించిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఈ విద్యావిధానం భారత్ ను ఓ సరికొత్త విజ్ఞాన సమాజంగా మార్చుతుంది. ఈ విద్యావిధానం ఓ చిన్నారిని మనదైన సంస్కృతి, విలువలే పునాదిగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. ఈ విద్యా విధానం యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుంది. ఈ మహోన్నత క్రతువులో రాష్ట్రాలు కూడా భాగస్వాములు కావాలని, భారత్ ను మరోస్థాయికి తీసుకెళ్లే క్రమంలో నూతన విద్యావిధానం అమలు చేస్తాయని ఆశిస్తున్నాను" అంటూ పవన్ సందేశం వెలువరించారు.