Jaya Jaitley: రక్షణశాఖ ఒప్పందాల అవినీతి కేసు... జయా జైట్లీకి నాలుగేళ్ల జైలు శిక్షను విధించిన కోర్టు!
- రక్షణ ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలు
- జయాతో పాటు మరో ఇద్దరికి జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు
- 2001లో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన తెహెల్కా
సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీకి ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు షాకిచ్చింది. 2001 నాటి రక్షణ శాఖకు చెందిన ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో జయాకు నాలుగేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. జయాతో పాటు సమతా పార్టీ మాజీ నేత గోపాల్ పచేర్యాల్, రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్పీ ముర్గయిలకు కూడా ఇదే శిక్షను విధించింది. జైలు శిక్షతో పాటు రూ. 1 లక్ష చొప్పున జరిమానా విధించింది.
ఆపరేషన్ వెస్ట్ ఎండ్ పేరుతో తెహల్కా 2001లో స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఈ స్టింగ్ ఆపరేషన్ అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసులో సురేందర్ కుమార్ సురేఖ అప్రూవర్ గా మారారు. జయా జైట్లీ రూ. 2 లక్షలు, మర్గయి రూ. 20 వేలు తీసుకున్నట్టు కోర్టు నిర్ధారించింది. సంబంధిత మంత్రులు, అధికారులతో పని చక్కబెట్టేందుకు జయ ఒప్పుకున్నందుకు డిఫెన్స్ పరికరాల బిజినెస్ మేన్ శామ్యూల్ అనే వ్యక్తి పచేర్యాల్ ద్వారా రూ. 2 లక్షలు అందజేశారు. లంచాలు తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో కోర్టు వీరందరికీ నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.