Hyderabad: హైదరాబాద్‌లో ఒకే కుటుంబంలో ముగ్గుర్ని బలి తీసుకున్న కరోనా

three people died with corona virus in one family
  • వారం రోజుల వ్యవధిలో ముగ్గురి మృతి
  • లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణాలు 
  • విషాదంలో రెండు కుటుంబాలు
కరోనా మహమ్మారి హైదరాబాద్‌లో ఓ కుటుంబంలోని ముగ్గుర్ని బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్లకు చెందిన ఆన్‌రెడ్డి సత్యనారాయణ రెడ్డి (60), భార్య సుకుమారి (55), కుమారుడితో కలిసి చంపాపేటలోని ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్నారు. ఆయన సోదరుడి కుమారుడైన అడ్వకేట్‌ ఆన్‌రెడ్డి హరీశ్‌రెడ్డి (37) కూడా తన భార్యాపిల్లలతో కలిసి ఇదే డివిజన్‌లోని రెడ్డికాలనీలో నివసిస్తున్నారు. మూడు రోజుల క్రితం హరీశ్‌రెడ్డి, ఆయన భార్య, ఐదేళ్ల కుమార్తెకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

అదే సమయంలో హరీశ్‌రెడ్డి బాబాయ్ ఆన్‌రెడ్డి సత్యనారాయణరెడ్డి, ఆయన భార్య సుకుమారి, వారి 21 ఏళ్ల కుమారుడు కూడా కరోనా బారినపడ్డారు. ఈలోపు హరీశ్‌రెడ్డికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో ఈ నెల మొదట్లో బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 23న ఆయన మృతి చెందారు. చికిత్స కోసం దాదాపు రూ. 16 లక్షలు ఖర్చు చేసినా రక్షించుకోలేకపోయామని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.  

మరోవైపు, సత్యనారాయణ, సుకుమారి కూడా కరోనా బారినపడడంతో ఈ నెల 10న సోమాజీగూడలోని డెక్కన్ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అయితే, ఆ తర్వాత రెండు రోజులకే మళ్లీ సమస్యలు తలెత్తడంతో ఈ నెల 15న సత్యనారాయణ తిరిగి అదే ఆసుపత్రిలో చేరారు. ఆయన భార్య సుకుమారికి కూడా ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతుండడంతో అదే ఆసుపత్రిలో చేర్చేందుకు ఆయన కుమారుడు యత్నించాడు.

అయితే, పడకలు లేకపోవడంతో వారు చేర్చుకోలేదు. దీంతో ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే ఆమె మెదడులో రక్తం గడ్డకట్టడంతో బ్రెయిన్ డెడ్ అయిన సుకుమారి మంగళవారం ఉదయం మృతి చెందింది. డెక్కన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త కూడా అదే రోజు రాత్రి మరణించారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వారం రోజుల వ్యవధిలోనే మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదం అలముకుంది. కాగా, ఇటీవల ఓ వివాదం విషయంలో అందరూ కలిసి కారులో స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే వారికి వైరస్ సంక్రమించినట్టు తెలుస్తోంది.
Hyderabad
Ranga Reddy District
Corona Virus

More Telugu News