Rajasthan: రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్‌గా వచ్చిన గోవింద్ సింగ్.. అభినందించిన సచిన్ పైలట్!
- కాంగ్రెస్ రాజస్థాన్ చీఫ్‌గా గోవింద్ సింగ్ డోటాసరా
- ఒత్తిడి, పక్షపాతం లేకుండా పనిచేయాలన్న పైలట్
- కార్యకర్తలకు సముచిత స్థానం ఇవ్వాలని సూచన
రాజస్థాన్‌లో తన స్థానంలో పీసీసీ చీఫ్ అయిన గోవింద్ సింగ్ డోటాసరాకు మాజీ చీఫ్ సచిన్ పైలట్ అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు. ఎలాంటి ఒత్తిడి, పక్షపాతం లేకుండా వ్యవహరించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలకు సముచిత గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నట్టు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పైలట్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు పీసీసీ చీఫ్ పదవి నుంచి సస్పెండ్ చేసింది.
ఖాళీ అయిన రాష్ట్ర అధ్యక్ష పదవిలో గోవింద్ సింగ్‌ను కూర్చోబెట్టింది. నిన్న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పైలట్ ఆయనకు అభినందనలు తెలిపారు. కాగా, రాజస్థాన్‌లో పైలట్ రాజేసిన నిప్పు ఇంకా రాజుకుంటూనే ఉంది. తమకు పూర్తి మద్దతు ఉన్నప్పటికీ అసెంబ్లీని సమావేశపరచకుండా గవర్నర్ కల్రాజ్ మిశ్రా అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపిస్తున్నారు. ఈ నెల 31న అసెంబ్లీని సమావేశపరచాలంటూ మూడోసారి చేసిన అభ్యర్థనను గవర్నర్ తాజాగా తిరస్కరించారు.