Sayyed Gilani: కశ్మీర్ వేర్పాటువాది గిలానీకి అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన పాకిస్థాన్
- గిలానీకి 'నిషాన్ ఈ పాకిస్థాన్' పురస్కారాన్ని ప్రకటించిన పాక్
- ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది పూర్తవుతున్న తరుణంలో ప్రకటన
- ఇటీవలే హురియత్ నుంచి బయటకు వచ్చిన గిలానీ
పాకిస్థాన్ లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భారత్ పై మరోసారి విద్వేషాన్ని చాటుకుంది. ఒళ్లంతా భారత్ పై ద్వేషాన్ని నింపుకున్న కశ్మీర్ వేర్పాటు వాది సయ్యద్ గిలానీని నెత్తికెత్తుకుంది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'నిషాన్ ఈ పాకిస్థాన్'ను గిలానీకి ప్రకటించింది. జమ్ముకశ్మీర్ ని రెండు ముక్కలు చేసి, ఆర్టికల్ 370ని రద్దు చేసి ఓ ఏడాది పూర్తి కావడానికి మరో వారం రోజులు ఉన్న తరుణంలో పాకిస్థాన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
మరోవైపు హురియత్ కాన్ఫరెన్స్ నుంచి ఇటీవలే గిలానీ బయటకు వచ్చారు. సంస్థలో తిరుగుబాటుతనం పెరిగిపోయిందని, జవాబుదారీతనం లోపించిందని, అందుకే హురియత్ కు తాను రాజీనామా చేశానని ఆయన తెలిపారు. వాస్తవానికి ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత... దాన్ని ఒక అజెండాగా మార్చడంలో గిలానీ విఫలమయ్యారంటూ పాక్ అసంతృప్తిని ప్రకటించింది. అయితే ఇంతలోనే మనను మార్చుకుని గిలానీకి అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది.