Mohammad Nooruddin: కరోనా పుణ్యమా అని 51 ఏళ్ల వయసులో టెన్త్ పాసయ్యాడు!
- 33 సార్లు పరీక్షలు రాసినా ఫెయిల్
- కరోనాతో టెన్త్ పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం
- ఎట్టకేలకు పాసైన వాచ్ మన్
హైదరాబాద్ లోని భోలక్ పూర్ అంజుమన్ బాలుర హైస్కూల్ లో వాచ్ మన్ గా పనిచేసే మహ్మద్ నూరుద్దీన్ ది ఓ విచిత్ర గాథ. ఇప్పటివరకు 33 సార్లు పదో తరగతి పరీక్షలు రాసినా పాస్ కాలేదు కానీ, కరోనా పుణ్యమా అని ఎట్టకేలకు పాసయ్యాడు. కరోనా ప్రభావంతో పది పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం అందరినీ పాస్ చేయడంతో మహ్మద్ నూరుద్దీన్ కూడా గట్టెక్కాడు. నూరుద్దీన్ తొలిసారిగా 1987లో ప్రైవేట్ గా టెన్త్ పరీక్షలు రాశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిసారీ అపజయమే.
ఇటీవలే టెన్త్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఫీజు కట్టాడు. కరోనా చలవతో పరీక్షలేమీ లేకపోవడంతో అందరిలాగే నూరుద్దీన్ ను కూడా పాస్ చేశారు. దీనిపై నూరుద్దీన్ మాట్లాడుతూ, ఇన్నాళ్లు ఎక్కువగా ఇంగ్లీష్ సబ్జెక్టులోనే ఫెయిల్ అయ్యేవాడ్నని, గవర్నమెంట్ ఉద్యోగం కోసమే తాను పది పరీక్షలు రాస్తున్నానని తెలిపారు. అన్నట్టు... నూరుద్దీన్ కు ఇంటర్ చదివిన ఇద్దరు కుమారులతో పాటు బీకాం ఉత్తీర్ణురాలైన ఓ కుమార్తె కూడా ఉంది.