Ajith pawar: ఆటో రిక్షా ఎటు వెళ్లాలన్న విషయాన్ని డ్రైవర్ నిర్ణయించడు.. ప్రయాణికులే నిర్ణయిస్తారు!: ఉద్ధవ్‌కు ఫడ్నవీస్ కౌంటర్
- ప్రభుత్వ స్టీరింగ్ ప్రతిపక్షాల చేతిలో లేదన్న ఉద్ధవ్
- కాంగ్రెస్, ఎన్సీపీ రెండు చక్రాల్లాంటివన్న సీఎం
- స్టీరింగ్ తన చేతిలో ఉన్న ఫొటోను పోస్టు చేసిన అజిత్ పవార్
మహారాష్ట్రలోని మహావికాశ్ అగాఢీ ప్రభుత్వ భవిష్యత్తు ప్రతిపక్షాల చేతిలో లేదని, స్టీరింగ్ తన చేతిలోనే ఉందన్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఆటో రిక్షా ఎటు వెళ్లాలన్న విషయాన్ని డ్రైవర్ నిర్ణయించడని, వెనక కూర్చున్న ప్రయాణికులే నిర్ణయిస్తారని ఆయన కౌంటర్ ఇచ్చారు.
ఉద్ధవ్ ఇటీవల సామ్నా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఆటో రిక్షా లాంటిదని, కాంగ్రెస్, ఎన్సీపీ రెండు చక్రాల్లాంటివని పేర్కొన్నారు. అవి ఎప్పుడూ తమ వెనక ఉంటాయని అన్నారు. మహావికాశ్ అగాఢీ ప్రభుత్వ భవిష్యత్తు ప్రతిపక్షాల చేతిలో లేదని, స్టీరింగ్ తన చేతిలోనే ఉందన్నారు. ఉద్ధవ్ వ్యాఖ్యలపై స్పందించిన ఫడ్నవీస్ ఇలా స్పందించారు.
మరోవైపు, సీఎం పుట్టిన రోజు నాడు అజిత్ పవార్ పోస్టు చేసిన ఓ ఫొటో వైరల్ అయింది. అందులో ఓ వాహనంలో అజిత్ పక్కన ఉద్ధవ్ కూర్చోగా, స్టీరింగ్ మాత్రం అజిత్ పవార్ చేతిలో ఉంది. ప్రభుత్వ స్టీరింగ్ తన చేతిలోనే ఉందని అర్థం వచ్చేలా ఉన్న ఈ ఫొటో ‘మహా’ రాజకీయాల్లో కలకలం రేపింది.