Mercedes Benz: ప్రపంచంలోనే తొలిసారి... వెనుక సీట్లకూ ఎయిర్ బ్యాగ్స్ తో రానున్న బెంజ్ కారు!
- పలు ప్రత్యేకతలతో రానున్న ఎస్-క్లాస్ న్యూ వేరియంట్
- వచ్చే సంవత్సరం మార్కెట్లోకివిడుదల
- సెప్టెంబర్ 2న పరిచయం చేయనున్న మెర్సిడిస్ బెంజ్
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కారు వెనుక సీట్లో ఎయిర్ బ్యాగ్స్ ను అమర్చిన తొలి కారు ఎస్ క్లాస్ న్యూమోడల్ ను మెర్సిడిస్ బెంజ్ 2021లో మార్కెట్లోకి తీసుకుని రానుంది. ఈ కారును అధికారికంగా తొలిసారిగా సెప్టెంబర్ 2న మెర్సిడిస్ బెంజ్ ప్రపంచానికి పరిచయం చేయనుంది. లగ్జరీ సెడాన్ వేరియంట్ గా వచ్చే ఈ కారులో కూర్చున్న వారందరికీ, ప్రమాదాల నుంచి ఎయిర్ బ్యాగ్స్ రక్షణ ఉంటుంది.
ఇక ఈ కారు అధునాతన టెక్నాలజీతో పాటు సేఫ్టీ ఫీచర్స్ విభాగంలో ముందుంటుందని సంస్థ గట్టిగా చెబుతోంది. ఈ కారులో చైల్డ్ సీట్, ఆప్షనల్ గా బెల్ట్ బ్యాగ్ సదుపాయం కూడా ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు వెనుక ఎయిర్ బ్యాగ్స్ తో ఉన్న కారు ఇమేజ్ ని మెర్సిడిస్ బెంజ్ విడుదల చేసింది.
ఈ వివరాల ప్రకారం, వెనుక సీట్లకు రక్షణ కల్పించే ఎయిర్ బ్యాగ్స్ 'యు' ఆకారంలో ఉంటాయని తెలుస్తోంది. అంటే, క్రికెట్ వికెట్ కీపర్ తన చేతికి వేసుకునే గ్లవ్స్ మాదిరిగా ఉంటాయి. ఈ ఆకారంలో ఉండే ఎయిర్ బ్యాగ్స్, పాసింజర్ కు మరింత రక్షణను అందిస్తాయి.
కాగా, ఈ కారులో రాడార్ సెన్సార్లు ఏవైనా ఇతర వాహనాలు అత్యంత సమీపంగా వస్తే, డ్రైవర్ ను హెచ్చరిస్తాయి. ఒకవేళ కారుకు పక్కనుంచి ప్రమాదం జరిగితే, ఎయిర్ కుషన్ యాక్టివేట్ అయి, ముందు కూర్చున్న పాసింజర్ ను ఆటోమేటిక్ గా కారు మధ్యలోకి తోసేస్తుంది. ఈ యాక్టివ్ బాడీ కంట్రోల్ సస్పెన్షన్ దీని ప్రత్యేకతని, ప్రమాదం జరుగగానే, మొత్తం వాహనాన్నీ ఇది పైకి లేపుతుందని, దీంతో కారు కింది భాగానికే తీవ్రత తాకుతుందని పేర్కొంది.
తమ కార్లకు సొంతంగా జరిపించిన ప్రమాదాల ఫలితాల విశ్లేషణ ఆధారంగా రీసెర్చ్ చేసి, ఈ సేఫ్టీ ఫంక్షన్స్ కారుకు జోడించామని మెర్సిడిస్ బెంజ్ పేర్కొంది. 3డీ నావిగేషన్ మ్యాప్స్, అగుమెంటెడ్ రియాలిటీ, ఎంబుక్స్ ఇన్ఫోటెయిన్ మెంట్ సిస్టమ్, 12.8 అంగుళాల ఓఎల్ఈడీ టచ్ స్క్రీన్, వాహనంలో ప్రయాణించే ఐదుగురికీ ఐదు ప్రత్యేక ఎంటర్ టెయిన్ మెంట్ స్క్రీన్స్ ఉంటాయని వెల్లడించింది.