Chiranjeevi: కరోనా నుంచి కోలుకున్న వాళ్లు దయచేసి ప్లాస్మా దానానికి ముందుకు రావాలి: చిరంజీవి
- కరోనా రోగుల ప్రాణాలు నిలుపుతున్న ప్లాస్మా థెరపీ
- ప్లాస్మా దానం ప్రచారానికి చిరంజీవి మద్దతు
- దీన్ని మించిన మానవత మరొకటి ఉండదంటూ ట్వీట్
కరోనా నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలో యాంటీబాడీలు తయారై ఉంటాయన్న సంగతి తెలిసిందే. వాళ్లు తమ ప్లాస్మా దానం చేస్తే ఆ ప్లాస్మాతో కరోనా రోగులకు చికిత్స చేసి వారి ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే ప్రభుత్వాలు ప్లాస్మా దానం చేయండంటూ కరోనా నుంచి కోలుకున్నవాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాయి. కొన్నిరోజులుగా సైబరాబాద్ పోలీసులు కూడా ప్లాస్మా డొనేషన్ పై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికారు.
"కరోనా నుంచి కోలుకున్న అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను... దయచేసి మీ ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రండి. తద్వారా ఇతరుల ప్రాణాలు కాపాడండి. కరోనా కష్టకాలంలో ఇంతకుమించిన మానవతా సాయం మరొకటి ఉంటుందని అనుకోను. కరోనాను గెలిచిన యోధులారా, ఇప్పుడు మీరు రక్షకులు అవ్వాల్సిన తరుణం వచ్చింది" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.