Hyderabad: కొవిడ్ నుంచి కోలుకుని ఇంటికొచ్చిన తల్లి.. అడుగుపెట్టనివ్వని కొడుకు, కోడలు
- గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న తల్లి
- ఇంట్లోకి రావొద్దంటూ తాళం వేసి వెళ్లిపోయిన కొడుకు, కోడలు
- హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఘటన
కొవిడ్ మహమ్మారి సోకితేనే కాదు.. కోలుకున్న తర్వాత కూడా ఈ మహమ్మారి భయపెడుతోంది. కుటుంబ సభ్యులను, బంధాలను ఈ మాయదారి వైరస్ ఎలా చిదిమేస్తోందీ చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. వైరస్ బారినపడి కోలుకుని ఇంటికి చేరుకున్న తల్లిని ఇంట్లోకి అడుగుపెట్టవద్దంటూ కుమారుడు హుకుం జారీ చేశాడు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో జరిగిందీ ఘటన.
ఇక్కడి బీజేఆర్ నగర్‌కు చెందిన మహిళ (55)కు ఇటీవల కరోనా సోకడంతో చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో చేరింది. చికిత్స అనంతరం కోలుకున్న ఆమె నిన్న సాయంత్రం ఇంటికి చేరుకుంది. మహమ్మారిని జయించి ఇంటికొచ్చిన తల్లిని చూసిన ఆమె కొడుకు, కోడలు ఆప్యాయంగా పలకరించకపోగా, ఇంట్లోకి అడుగుపెట్టవద్దంటూ హుకుం జారీ చేశారు. అంతేకాదు, ఇంటిపైకప్పు రేకులను ధ్వంసం చేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. కొడుకు, కోడలు తీరుతో విస్తుపోయిన ఆమె రాత్రంతా ఇంటి ముందే గడిపింది.