Raisa Ansari: కూరగాయలు అమ్ముకునే మహిళ ఆంగ్లంలో అదరగొట్టింది... వీడియో ఇదిగో!
- ఇండోర్ నగరంలో తోపుడు బండ్లపై నిషేధం
- తన బండిని నిషేధిస్తే కుటుంబ పోషణ ఎలాగంటూ మహిళ ఆవేదన
- ఆమె ఇంగ్లీషులో మాట్లాడడంతో అధికారుల దిగ్భ్రాంతి
సాధారణంగా తోపుడు బళ్లపై అమ్మకాలు సాగించే వాళ్లంతా పెద్దగా చదువుకోని వాళ్లని, చదువుకోకపోవడం వల్లే అలా రోడ్ల పక్కన బళ్లపై అమ్ముకుంటూ పొట్టపోసుకుంటారని అందరిలో ఓ అభిప్రాయం ఉంది. అయితే భోపాల్ కు చెందిన ఓ మహిళ ఆ అభిప్రాయాన్ని సవరించుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది. ఇంగ్లీషులో ఆమె వాగ్ధాటికి అధికారులే నోర్లు తెరిచారు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరానికి చెందిన రైనా అన్సారీ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటోంది. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇండోర్ పురపాలక శాఖ అధికారులు తోపుడు బళ్లను నిషేధించారు. రోడ్డు పక్కన తోపుడు బండితో అమ్మకాలు సాగిస్తున్న రైసా అన్సారీ వద్దకు వచ్చి బండి అక్కడి నుంచి తొలగించాలన్నారు. బండి తొలగిస్తే తమ కుటుంబాలను ఎవరు పోషిస్తారంటూ రైసా ఒక్కసారిగా ఆంగ్లంలో అదరగొట్టింది. తన బండి వద్ద రద్దీ లేకపోయినా అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కుటుంబంలో 20 మంది సభ్యులు ఉన్నారని, తాను బండిపై అమ్మకాలు జరపకపోతే వారందరి పోషణ ఎవరు చూస్తారని ప్రశ్నించింది.
ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతున్న ఆమెను చూసి అధికారులు, మీడియా ప్రతినిధులు నిజంగా ఆశ్చర్యపోయారు. ఇంతకీ మీరేం చదువుకున్నారని ప్రశ్నించగా, దేవి అహల్య యూనివర్సిటీ నుంచి మెటీరియల్ సైన్స్ లో పీహెచ్ డీ చేశానని చెప్పగానే, వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.