Rajasthan: ఈడీ దాడులకు బెదిరిపోతానా?.. ప్రజలు వారిని క్షమించరు: అశోక్ గెహ్లాట్
- అసెంబ్లీలో మాకు పూర్తి మెజారిటీ ఉంది
- కేంద్ర దర్యాప్తు సంస్థలు కొందరిని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నాయి
- బందీలుగా ఉన్న ఆ ఎమ్మెల్యేలు కూడా మాకే ఓటేస్తారు
ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు రాజస్థాన్‌లో చాలా క్రియాశీలంగా పనిచేస్తున్నప్పటికీ వాటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తేల్చి చెప్పారు. తన సోదరుడి ఇంటిపై ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో సీఎం ఇలా స్పందించారు.
కొందర్ని లక్ష్యంగా చేసుకుని ఆ సంస్థలు పనిచేస్తున్నాయని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, క్షమించబోరని హెచ్చరించారు. ఇటీవల కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో టేపులపై మాట్లాడుతూ.. అవి నిజమైనవేనని, అయినా సరే ఆ టేపుల్లో ఉన్నది తమ గొంతు కాదని కొందరు వాదిస్తున్నారని గెహ్లాట్ అన్నారు. వారెన్ని చెప్పినా చివరికి సత్యమే గెలుస్తుందన్నారు.
ఇక, అసెంబ్లీలో తమకు పూర్తి మెజారిటీ ఉందని, తామంతా ఐకమత్యంగానే ఉన్నామని సీఎం పేర్కొన్నారు. కొందరు ఎమ్మెల్యేలను బందీలుగా పెట్టుకుని వారికి బౌన్సర్లను కాపలాగా పెట్టారని, వారితో కూడా తాము టచ్‌లో ఉన్నామని అన్నారు. వారు కూడా తమ వెంటే ఉంటారని, తమకే ఓటు వేస్తారని గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు.