Chiranjeevi: మీరు చేస్తున్న కృషికి చేతులెత్తి నమస్కరిస్తున్నా: 'ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం' పట్ల చిరంజీవి

Chiranjeevi praises NRI Telugu people

  • రేపటి నుంచి ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు 
  • ప్రవాస తెలుగువారికి, తానాకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
  • కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్ష

రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు విజయవంతం కావాలని చిరంజీవి ఆకాంక్షించారు. తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రవాస తెలుగువారు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

'ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన, బలపడిన తెలుగువారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా మీరందరూ ప్రవాస జీవితం గడుపుతున్నప్పటికీ... తెలుగు భాష, తెలుగు సంస్కృతి పట్ల మీకున్న అభిమానానికి నా అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు 15వ స్థానంలో ఉంది. ఇండియాలో హిందీ, బెంగాలీ తర్వాత మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అమెరికాలో హిందీ, గుజరాతీ తర్వాత మూడో స్థానంలో ఉంది.

ఇంతటి గొప్ప తెలుగు సంప్రదాయ పరిరక్షణ కోసం తానా ఆధ్వర్యంలో దాదాపు 100 దేశాల్లోని తెలుగు సంస్థలు ఒకే తాటిపైకి వచ్చి... జూలై 24 నుంచి 26వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషకరం. ప్రాచీన హోదాను దక్కించుకున్న తెలుగు భాష సంస్కృతిని కాపాడుకునేందుకు ఇలాంటి భాషా సాంస్కృతిక సమ్మేళనాలు చాలా అవసరం. దేశ భాషలందు తెలుగు లెస్స... ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రశంసలు అందుకున్న భాష మనది. ఈ కరోనా కష్ట కాలంలో కూడా తెలుగు సంప్రదాయ విలువలను ముందు తరాల వారికి అందించేందుకు మీరు చేస్తున్న కృషికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ మూడు రోజుల కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆశిస్తున్నా' అని చిరంజీవి చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News