vaccine: అందుకే ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాను: అనుభవాలు పంచుకున్న భారత సంతతి వ్యక్తి
- టీకా పరీక్షల్లో పాల్గొన్న దీపక్ పాలివాల్
- డబ్బు కూడా తీసుకోలేదని వ్యాఖ్య
- మానవాళి సంక్షేమం కోసం ముందుకొచ్చాను
- కుటుంబ సభ్యులకు చెప్పలేదు
- నాలో దుష్ప్రభావాలు కనపడలేదు
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచం మొత్తం టీకా కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ అభివృద్ధి చేస్తోన్న టీకాపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. మానవులపై నిర్వహించిన ప్రయోగం విజయవంతం కావడంతో ఆ టీకా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
ఈ టీకా పరీక్షల్లో పాల్గొన్న వాలంటీర్లలో భారత సంతతికి చెందిన దీపక్ పాలివాల్ ఉన్నాడు. ఇందుకోసం ఆయన డబ్బు కూడా తీసుకోలేదు. లండన్‌లోని ఓ ఔషధ సంస్థలో పని చేస్తోన్న దీపక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపాడు. మానవాళి సంక్షేమం కోసం ముందుకు రావాలన్న ఉద్దేశంతోనే తాను ఇందులో పాలు పంచుకున్నానని చెప్పాడు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్-19ను అరికట్టే టీకాను మానవులపై ప్రయోగించే పనులు ప్రారంభం కాబోతున్నాయని తాను తన స్నేహితుడి ద్వారా తెలుసుకున్నానని, ఆ వెంటనే ఇందులో పాల్గొనడానికి తాను ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకున్నానని అన్నాడు.
తన కుటుంబ సభ్యులు జైపూర్‌లో ఉంటారని, ఈ ప్రయోగంలో పాల్గొంటున్నానని వారికి తెలిస్తే అనుమతించబోరన్న ఉద్దేశంతో వారికి ఈ విషయాన్ని చెప్పలేదని అన్నాడు. ఈ ప్రయోగం వల్ల తనలో ఎలాంటి ప్రతికూల మార్పులు కరపడలేదని చెప్పాడు. వైద్యులు తనకు టీకా ఇంజెక్షన్ చేశారని, దాదాపు రెండు గంటల పాటు తనను పరిశీలనలో ఉంచారని చెప్పాడు.
అనంతరం పరీక్షలు చేసి, పంపేశారని అన్నాడు. ఆక్స్‌ఫర్డ్ నిర్వహించిన మూడు దశల ప్రయోగాల్లోనూ మంచి ఫలితాలు వచ్చాయని అన్నాడు. కరోనాను అరికట్టడానికి అభివృద్ధి చేసిన ఈ టీకా త్వరలోనే మార్కెట్‌లోకి రావచ్చని తెలిపాడు. అప్పటివరకు కరోనా సోకకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరాడు.