Oxford: ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సక్సెస్... రెట్టింపు రక్షణ ఇస్తోందన్న పరిశోధకులు
- క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్
- యాంటీబాడీలతో పాటు టి-కణాల ఉత్పత్తి
- ఎవరికీ రియాక్షన్ రాలేదన్న లాన్సెట్ సైన్స్ జర్నల్ ఎడిటర్
కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని దేశాల చూపు ఆక్స్ ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న వ్యాక్సిన్ పైనే ఉంది. అనేక దేశాల్లో కరోనా వ్యాక్సిన్ లపై ప్రయోగాలు జరుగుతున్నా, ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి ఆక్స్ ఫర్డ్ వర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ అన్నింటికంటే ముందంజలో ఉంది. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్ దశలో ఉంది. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా, వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో ఎలాంటి దుష్ఫలితాలు కనిపించడంలేదని, పైగా రెట్టింపు రక్షణ కలుగుతోందని ఆస్ట్రాజెనెకా వర్గాలు తెలిపాయి. యాంటీబాడీలతో పాటు ఇమ్యూనిటీకి దన్నుగా నిలిచే టి-కణాలు కూడా మెండుగా ఉత్పత్తి అవుతున్నాయని పరిశోధకులు సంతోషం వ్యక్తం చేశారు.
దీనిపై లాన్సెట్ సైన్స్ జర్నల్ ఎడిటర్ రిచర్డ్ హోర్టన్ మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలిందని, ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరిలోనూ రియాక్షన్ కనిపించలేదని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ తో వ్యక్తుల్లోని ఇమ్యూనిటీ చైతన్యం పుంజుకుందని వివరించారు.