Ayodhya Ram Mandir: మూల విరాట్టు కింద 40 కేజీల వెండి ఇటుక.. అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ వివరాలు!

Grand Preps For Ayodhya Temple Groundbreaking Event
  • ఆగస్ట్ 5వ తేదీన రామాలయ నిర్మాణానికి భూమి పూజ
  • హాజరవుతున్న 50 మందికి పైగా వీఐపీలు
  • బీజేపీ సీనియర్ నేతలందరికీ ఆహ్వానం
ఆగస్ట్ 5వ తేదీన అయోధ్యలోని రామాలయం నిర్మాణానికి భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. 50 మందికి పైగా వీఐపీలు ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించనున్నారు. అయోధ్య నగర వ్యాప్తంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్క్రీన్ల ద్వారా భక్తులు భూమి పూజను వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నారు.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గర్భగుడిలో దేవుడిని ప్రతిష్ఠించే ప్రాంతంలో 40 కేజీల వెండి ఇటుకను ఉంచబోతున్నట్టు తెలిపారు. దీనినే పునాదిరాయిగా ప్రధాని చేతుల మీదుగా ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ప్రధాన కార్యక్రమానికి మూడు రోజుల ముందు నుంచి వేద శాస్త్రాలను అనుసరించి క్రతువులు ఉంటాయని చెప్పారు. కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించామని తెలిపారు. అయితే ఆయన ఏ రోజు వస్తారనే విషయాన్ని ప్రధాని కార్యాలయం ఇంకా నిర్ధారించలేదని చెప్పారు. కాకపోతే, 5వ తేదీని ఆయన వస్తున్నట్టు తమకు సమాచారం ఉందని తెలిపారు.

అయోధ్య ఉద్యమంతో సంబంధం ఉన్న సీనియర్ బీజేపీ నేతలందరినీ ఆహ్వానించామని ట్రస్ట్ తెలిపింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్, సాధ్వి రితంభర తదితరులంతా ఈ జాబితాలో ఉన్నారని వెల్లడించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపింది.
Ayodhya Ram Mandir
Ayodhya Temple Trust
Groundbreaking Event

More Telugu News