Ikea: హైదరాబాదులో మరోసారి మూతపడిన ఐకియా స్టోర్
- నగరంలో కరోనా స్వైరవిహారం
- అందరి భద్రత కోసం నిర్ణయం తీసుకున్నట్టు ఐకియా వెల్లడి
- ఆన్ లైన్ లో అందుబాటులో సేవలు
హైదరాబాదులో అత్యంత పెద్ద ఫర్నీచర్ షోరూంగా పేరుగాంచిన ఐకియా దుకాణం మరోసారి మూతపడనుంది. నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడం పట్ల ఐకియా నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే షోరూం మూసేయాలని నిర్ణయించారు. వినియోగదారులు, సిబ్బంది ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఈ స్వీడన్ సంస్థ తెలిపింది.
తమ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తుందని, ఇప్పటికే వినియోగదారులకు మెయిల్ ద్వారా సమాచారం అందించామని వివరించింది. ఈ మేరకు ఐకియా సీఈవో పీటర్ బెట్జెల్ లేఖ రాశారు. అయితే మళ్లీ స్టోర్ ను ఎప్పుడు పునఃప్రారంభించేది వెల్లడించలేదు. లాక్ డౌన్ కారణంగా మూతపడిన ఐకియా ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. విక్రయాల సందర్భంగా పటిష్ట చర్యలు తీసుకున్నా, నగరంలో కరోనా కేసుల సంఖ్య అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతుండడంతో మరోసారి మూసివేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే, ఆన్ లైన్ లో మాత్రం తమ సేవలు కొనసాగుతాయని ఐకియా వెల్లడించింది.