Rum: 90 ఎంఎల్ రమ్, టీ స్పూను మిరియాల పొడితో కరోనా పరార్... ఓ ప్రజాప్రతినిధి కొత్త 'మందు' కథ!
- రెండు ఆమ్లెట్లు కూడా తినాలంటున్న మున్సిపల్ కౌన్సిలర్
- మంగళూరు కౌన్సిలర్ ఆసక్తికర ఫార్ములా
- వీడియో వైరల్
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక సోషల్ మీడియాలో అనేక చికిత్సా విధానాలను సూచిస్తూ పోస్టులు దర్శనమిస్తున్నాయి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనూ కరోనాను ఇలా తరిమికొట్టండి, ఇది తింటే కరోనా మిమ్మల్ని చూస్తేనే పారిపోతుంది అంటూ నిత్యం అనేక రకాలు పోస్టులు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి వేదికలపై సందడి చేస్తుంటాయి. సాధారణ పౌరులు ఇలాంటి సలహాలు ఇవ్వడం అటుంచితే, బాధ్యత గల ప్రజాప్రతినిధి అయ్యుండి ఓ మున్సిపల్ కౌన్సిలర్ కరోనాను పారదోలేందుకు తనవంతు ఓ ఫార్ములా పరిచయం చేశాడు.
90 ఎంఎల్ మోతాదులో రమ్ కు, ఒక టీ స్పూను మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని తాగితే కరోనా నుంచి రక్షణ కలుగుతుందట. పనిలోపనిగా రెండు ఆమ్లెట్లు కూడా తినాలట. ప్రస్తుతం కరోనాకు అనేక చికిత్సలు ఉండగా, అన్నింట్లోకి రమ్, మిరియాలపొడి పద్ధతి సత్ఫలితాలనిస్తోందని ఆయన తెలిపాడు. కర్ణాటకలోని మంగళూరులో మున్సిపల్ కౌన్సిలర్ గా పదవిలో ఉన్న రవిచంద్ర గట్టి ఈ సరికొత్త ఫార్ములా సృష్టికర్త! ఆయన స్థానికంగా కరోనా కమిటీలో సభ్యుడు కూడా. ఓ పొలిటికల్ లీడర్ గా కాకుండా, కరోనా కమిటీ సభ్యుడి ఈ రమ్, మిరియాల పొడి కాంబినేషన్ గురించి ప్రచారం చేస్తున్నానని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.