Corona Virus: పెరుగుతున్న ఆందోళన.. కేవలం 59 రోజుల్లో 9 లక్షల కేసులు!

9 lakh corona cases registered in only 59 days in India

  • తొలి లక్ష కరోనా కేసులకు పట్టిన సమయం 110 రోజులు
  • ఆ తర్వాతి 9 లక్షల కేసులకు పట్టిన సమయం 59 రోజులు
  • రానున్న రోజుల్లో మరింతగా పెరగనున్న కేసులు

భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఈ రోజుతో మొత్తం కేసుల సంఖ్య 10,03,832కి చేరుకోవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కళ్లకు కట్టినట్టు చెబుతోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తొలి రోజుల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్న సమయంలోనే అందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మూడు, నాలుగు రోజుల్లోనే  కొత్తగా లక్ష వరకు కేసులు నమోదవుతున్నాయి.

మన దేశంలో తొలి లక్ష కేసులు నమోదవడానికి 110 రోజులు పట్టగా... మిగిలిన 9 లక్షల కేసులు నమోదు కావడానికి కేవలం 59 రోజులు మాత్రమే పట్టింది. అంటే... తొలి లక్ష కేసులకు మూడు నెలలు పట్టగా... మిగిలిన 9 లక్షల కేసులకు కేవలం రెండు నెలలు మాత్రమే పట్టిందన్నమాట. రాబోయే రోజుల్లో ఈ వేగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇండియాలో ప్రతి రోజు 2.80 లక్షల కేసులు నమోదవుతాయని ఒక సర్వే అంచనా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే... అది నిజం కావచ్చేమోననే భయం కలుగుతుంది.  

అయితే, కేసులు భారీగానే నమోదవుతున్నప్పటికీ... మనకు ఊరటను కలిగించే అంశం కూడా ఒకటి ఉంది. మన దేశంలో కరోనా రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 22,942 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జూన్ నెల మధ్యలో రికవరీ రేటు 50 శాతం మాత్రమే ఉండగా... ఇప్పుడు అది 63 శాతానికి పెరిగింది.

  • Loading...

More Telugu News