KCR: 200 మంది మినహా అందరూ కోలుకుంటున్నారు.. భయపడొద్దు: కేసీఆర్

Except 200 patients all are recovering says KCR

  • రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 67 శాతంగా ఉంది
  • జాతీయ సగటుతో పోలిస్తే మరణాల రేటు తక్కువగా ఉంది
  • ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్లు 5 వేల వరకు అందుబాటులో ఉన్నాయి

కరోనా మహమ్మారి విషయంలో ఎవరూ భయపడొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అయితే, ఏ ఒక్కరూ మహమ్మారి విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదని, తగు జాగ్రత్తలను పాటించాలని సూచించారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 67 శాతంగా ఉందని చెప్పారు. తీవ్రమైన జబ్బులు ఉన్న 200 మంది మినహా మిగిలిన అందరూ కోలుకుంటున్నారని తెలిపారు. వివిధ ఆసుపత్రుల్లో 3,692 మంది చికిత్స పొందుతున్నారని... 9,636 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు. కరోనాపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

ప్రజలంతా వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. గాంధీ ఆసుపత్రి, టిమ్స్ లో 3 వేల బెడ్లను ఆక్సిజన్ సదుపాయాలతో సిద్ధం చేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్లు 5 వేల వరకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉందని కేసీఆర్ తెలిపారు. వైద్య, ఆరోగ్య సిబ్బందితో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 10 శాతం అదనపు వేతనాన్ని ఇవ్వాలని ఆదేశించారు. బెడ్ల అందుబాటు విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులు పారదర్శకంగా వ్యవహరించాలని హెచ్చరించారు. కృత్రిమ కొరతను సృష్టించే ఆసుపత్రులు కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

ఎంతమందికైనా చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు, సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారని కేసీఆర్ చెప్పారు. కరోనా పేషెంట్లు అధిక ఫీజులు చెల్లిస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News