India: పది లక్షలు దాటిన కేసులు, పాతిక వేలు దాటిన మరణాలు!

Over 10 Lakh Cases in India

  • తొలి కేసు నుంచి 170 రోజుల్లోపే...
  • తొలి స్థానంలో మహారాష్ట్ర, రెండో స్థానంలో తమిళనాడు
  • వచ్చే నెలలోనే బ్రెజిల్ ను దాటనున్న ఇండియా

ఇండియాలో కరోనా మహమ్మారి విస్తరణ వేగం మరింతగా పెరిగింది. కేసుల సంఖ్య 10 లక్షల మార్క్ ను దాటేసింది. నిన్న రాత్రి 9.30 గంటలకు ఈ విషయాన్ని వెల్లడించిన పీటీఐ, ఇండియాలో కేసుల సంఖ్య 10,00,202కు చేరిందని, ఇదే సమయంలో మరణాల రేటు 25 వేలను దాటిందని పేర్కొంది. ఇండియాలో తొలి కరోనా కేసు జనవరి 30న కేరళలో వెలుగులోకి రాగా, ఆపై దాదాపు 170 రోజుల్లోపే 10 లక్షలకు పైగా కేసులు రావడం గమనార్హం.

రాష్ట్రాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర ముందు నిలిచింది. గురువారం నాడు రాష్ట్రంలో 8,641 కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 2,83,281కి చేరింది. 11,194 మంది చనిపోయారు. ఆ తరువాతి స్థానంలో ఉన్న తమిళనాడులో 1,56,369 మంది వైరస్ బారిన పడ్డారు. మూడో స్థానంలో ఉన్న దేశ రాజధాని న్యూఢిల్లీలో 1,18,645 మందికి వ్యాధి సోకింది. కర్ణాటకలో నిన్న కొత్తగా 4,149 మందికి వైరస్ సోకగా, మొత్తం కేసుల సంఖ్య 50 వేల మార్క్ ను దాటేసింది.

జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలో కోటికి పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో అత్యధికంగా 35 లక్షల కేసులు వచ్చాయి. రెండో స్థానంలో కొనసాగుతున్న బ్రెజిల్ లో 19.66 లక్షల కేసులున్నాయి. ఇక ఇండియాలో ఇదే విధంగా కేసుల పెరుగుదల కొనసాగితే, ఆగస్టు రెండో వారంలోపే కేసుల సంఖ్య విషయంలో బ్రెజిల్ ను దాటేసే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News