Oxford: సత్ఫలితాలను ఇస్తున్న వ్యాక్సిన్.. నేడు శుభవార్త చెప్పనున్న ఆక్స్ ఫర్డ్!
- ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సత్ఫలితాలు
- బ్రెజిల్ లో వేలాది మందిపై ప్రయోగాలు
- యాంటీ బాడీలు తయారైనట్టు సమాచారం
ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చిందని తెలుస్తోంది. దాదాపు ఏడు నెలలుగా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న ప్రపంచ మానవాళికి నేడు ఈ శుభవార్త అధికారికంగా తెలుస్తుంది. ఇప్పటికే రెండు దశల్లో వ్యాక్సిన్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన ఆక్స్ ఫర్డ్, మూడవ దశ పరీక్షలను గత నెలలో బ్రెజిల్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.
బ్రెజిల్ లో వేలాది మందిపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించగా, విజయవంతం అయినట్టు తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని, ఈ వార్త దాదాపుగా గురువారం నాడు బయటకు వస్తుందని ఐటీవీ పొలిటికల్ ఎడిటర్ రాబర్ట్ పెస్టన్, తన బ్లాగ్ లో వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ వాడిన వారిలో యాంటీ బాడీలు, టీ-సెల్ (కరోనా వైరస్ కిల్లర్ సెల్) లను జనరేట్ చేసిందని, ఈ వ్యాక్సిన్ ప్రభావవంతమైనదేనని ఆక్స్ ఫర్డ్ నిరూపిస్తే, సెప్టెంబర్ నుంచి భారీ ఎత్తున తయారీ జరుగుతుందని ఆయన అన్నారు.
కాగా, రాబర్డ్ పెస్టన్ తన బ్లాగ్ లో ఈ విషయాన్ని వెల్లడించగానే, లండన్ స్టాక్ మార్కెట్లో ఆస్ట్రా జెనికా ఈక్విటీ విలువ 5 శాతం లాభపడింది. ఇదిలావుండగా, కరోనాపై బ్రిటన్, చైనా, ఇండియా, యూఎస్ తదితర దేశాల్లో సుమారు 12కు పైగా రకాల వ్యాక్సిన్ లు వివిధ దశల్లో పరీక్షించబడుతున్న సంగతి తెలిసిందే.