Mumbai: వచ్చే 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.. జాగ్రత్త: ముంబై వాసులకు రెడ్ అలర్ట్
- భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం
- బయటకు ఎవరూ రావొద్దంటూ బీఎంసీ హెచ్చరికలు
- బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం
భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముంబై వాసులకు తాజాగా వాతావరణ శాఖ చేసిన మరో హెచ్చరిక భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాగల 48 గంటల్లో ముంబైతోపాటు సమీప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని బీఎంసీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక, దాదర్, సియాన్, హింద్ మాత, జోగేశ్వరి ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 201 మిల్లీ మీటర్ల భారీ వర్షపాతం నమోదు కాగా, కొలాబాలో 152, శాంతాక్రజ్‌లో 159.7, మహాలక్ష్మి ప్రాంతంలో 129, రామమందిర్ ప్రాంతంలో 130 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.