Bishop Franco Mulakkal: కేరళ నన్‌పై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్‌కు కరోనా
- 6న టెస్టు చేయించుకుంటే నెగటివ్
- తప్పుడు వివరాలతో కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్న బిషప్
- బెయిలు రద్దు చేసి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు
కేరళ నన్‌పై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్ కరోనా బారినపడ్డారు. తన లాయర్ కరోనా బారినపడడంతో బిషప్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇప్పుడు ఆయనకు కూడా కరోనా నిర్ధారణ అయినట్టు జలంధర్ నోడల్ అధికారి టీపీ సింగ్ పేర్కొన్నారు. కాగా, అత్యాచార ఆరోపణల కేసు విచారణకు బిషప్ సరిగా హాజరు కాకపోవడంపై కొట్టాయంలోని స్థానిక కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఆయనకు మంజూరు చేసిన బెయిలును రద్దు చేయడంతోపాటు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.
ఈ నెల 1న కోర్టు విచారణకు హాజరు కాకుండా బిషప్ తప్పించుకున్నారు. అయితే, జలంధర్ ప్రాంతం కంటైన్‌మెంట్ జోన్‌లో ఉండడం వల్లే తాను హాజరు కాలేకపోయానని తెలిపారు. అయితే, ఆయన మాటల్లో వాస్తవం లేదని, జలంధర్ ప్రాంతం కంటైన్‌మెంట్ ప్రాంతంలో లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దీనికి స్పందించిన న్యాయస్థానం గతంలో మంజూరు చేసిన బెయిలును రద్దు చేయడంతోపాటు కొత్తగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది. కాగా, ఈ నెల 6న బిషప్ కరోనా టెస్టు చేయించుకున్నారు. అయితే ఫలితాల్లో నెగటివ్ వచ్చింది. గొంతు నొప్పి, దగ్గు రావడంతో సోమవారం మరోసారి కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది.