Facebook: ఫేస్‌బుక్‌ ఖాతాను డిలీట్ చేస్తే చాలా కోల్పోతానన్న లెఫ్టినెంట్ కల్నల్.. అయితే ఉద్యోగానికి రాజీనామా చేయాలన్న ఢిల్లీ హైకోర్ట్!

Choose one from Army or Facebook Says High Court to petitioner

  • సైన్యంలో సోషల్ మీడియా యాప్‌లపై నిషేధం
  • వ్యతిరేకంగా కోర్టుకెక్కిన లెఫ్టినెంట్ కల్నల్
  • మినహాయింపు కుదరదన్న కోర్టు

భారత సైన్యంలో సోషల్ మీడియా యాప్‌లను డిలీట్ చేయడానికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టుకెక్కిన ఓ లెఫ్టినెంట్ కల్నల్‌కు చుక్కెదురైంది. ఫేస్‌బుక్‌ను వదులుకోవడం ఇష్టం లేకుంటే ఉద్యోగాన్ని వదులుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సైన్యం ఆదేశాలకు అనుగుణంగా ఖాతాలను డిలీట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. సైన్యంలో పనిచేసే వారు సోషల్ మీడియా యాప్‌లను డిలీట్ చేయాల్సిందేనని ఇటీవల సైన్యం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీని నుంచి మినహాయింపు కోరుతూ లెఫ్టినెంట్ కల్నల్ పీకే చౌదరి కోర్టు కెక్కారు. ఫేస్‌బుక్ ఖాతాను డిలీట్ చేస్తే డేటా, ఫ్రెండ్స్, కంటెంట్‌ను శాశ్వతంగా కోల్పోతానని, ఈ నష్టాన్ని తర్వాత పూడ్చలేమని కోర్టుకు తెలిపారు.

స్పందించిన న్యాయస్థానం.. సైన్యం నుంచి వైదొలిగిన తర్వాత ఫేస్‌బుక్‌లో మళ్లీ కొత్తగా ఖాతా తెరుచుకోవచ్చని, అది ఇప్పటి ఖాతాలానే పనిచేస్తుందని పేర్కొంది. దేశ భద్రతపై ఆందోళనలు చెలరేగుతున్న వేళ మినహాయింపులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. సంస్థ చెప్పినట్టు నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. లేదూ, ఉద్యోగానికంటే ఫేస్‌బుక్‌ అంటేనే ఇష్టమనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేయవచ్చని, ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుందని జస్టిస్ రాజీవ్ సహాయ్, ఆశా మేనన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది.

ఈ కేసులో కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ మాట్లాడుతూ.. ఫేస్‌బుక్‌లో తాము గుర్తించిన బగ్ సైబర్ యుద్ధంలో వినియోగించేదానిలానే పనిచేస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే అది సైన్యంలోని చాలామంది ప్రతినిధులను లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. దీనిపై సైన్యం పాలసీని పరిశీలించి కోర్టు తీర్పును ఈ నెల 21కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News